
స్టాక్ మార్కెట్ జూదం లాంటిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టాక్ మార్కెట్ వల్ల కొంతమంది రాత్రికి రాత్రే లక్షాధికారులు అవుతుంటే… మంరికొంతమంది ఆశకు పోయి అప్పుల పాలవుతున్నారు. అలా స్టాక్ మార్కెట్ లో నష్టపోయిన ఓ వ్యక్తి ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు హాలీవుడ్ రేంజ్ లో స్కెచ్ వేసి కిడ్నాప్ డ్రామా ఆడాడు. తన భార్యనే టార్గెట్ చేసి రూ.50 లక్షల కోసం ఆడిన కిడ్నాప్ డ్రామా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
సూరత్‌కు చెందిన 30 ఏళ్ల జిగ్నేష్ లాల్‌జీభాయ్ తలవియా అనే వ్యక్తి ఇటీవల స్టాక్ మార్కెట్లో షేర్లు కొని, భారీగా నష్టపోయాడు. అయితే.. నష్టాలను రికవరీ చేసుకునేందుకు అద్భుతమైన ఐడియా వేశాడు జిగ్నేష్. సెల్ఫ్ కిడ్నాప్ డ్రామా ఆడి రూ. 50 లక్షలు గుంజేద్దాం అనుకున్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడవుగా… ఒక రూమ్ బుక్ చేసుకొని కిడ్నాప్ డ్రామా స్టార్ట్ చేశాడు
సినిమాల్లో కిడ్నాప్ సీన్ లాగే జిగ్నేష్ కూడా తన కాళ్ళు, చేతులు కట్టేసుకుని నోటికి ప్లాస్టర్ వేసుకొని ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోలను తన భార్యకు వాట్సాప్ లో పంపాడు. మర్యాదగా రూ.50 లక్షలు పంపించు లేదంటే నీ మొగుడి శవాన్ని చుస్తావంటూ బెదిరింపు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసి తన భర్తను నిజంగానే కిడ్నాప్ చేశారేమోనని బయపడింది జిగ్నేష్ భార్య. భయాందోళనకు గురైన ఆమె పోలీసులను ఆశ్రయించింది.
తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించేసరికి అసలు విషయం బయటపడింది. నిజమైన కిడ్నాపర్లు అయితే ఫోన్ పట్టుకుని వణుకుతూనో, లేదా కోపంగానో రికార్డ్ చేస్తారు. కానీ ఇక్కడ వీడియోలో ఫోన్ చాలా స్టడీగా ట్రైపాడ్ తో రికార్డ్ చేసినట్లు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పైగా హీరో మోహంలో భయం కంటే… డైలాగ్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ కనిపించడంతో పోలీసులకు క్లారిటీ వచ్చింది.
స్క్రిప్ట్, డైరెక్షన్ పక్కాగా ఉన్నా కానీ.. యాక్టింగ్ విషయంలో దొరికిపోయాడు జిగ్నేష్. సైబర్ సెల్ సాయంతో మొబైల్ సిగ్నల్స్ ట్రాక్ చేసి హీరోను పట్టుకున్నారు పోలీసులు. గోద్రా లోని ఓ లగ్జరీ హోటల్ లో రూమ్ చేరుకున్న పోలీసులు… రూమ్ తలుపులు బద్దలు కొట్టి జిగ్నేష్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్య అకౌంట్ నుండి రూ. 50 లక్షలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న జిగ్నేష్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
జిగ్నేష్ ను అదుపులోకి తీసుకొని తమ స్టైల్ లో విచారించారు పోలీసులు. ఇంకేముంది కథ మొత్తం చెప్పేశాడు. స్టాక్ మార్కెట్ నష్టాల నుండి తప్పించుకోవడానికి, సొంత కుటుంబం నుంచే డబ్బులు గుంజడానికి ఈ స్కెచ్ వేశానని ఒప్పుకున్నాడు జిగ్నేష్. భార్య నుంచి రూ. 50 లక్షలు గుంజుదామని హైటెక్ ప్లాన్ వేసిన జిగ్నేష్ ఇప్పుడు జైల్లో ఉచలు లెక్కపెడుతున్నాడు.