Reading Time: 2 minutes

Allu Arjun: మానవత్వం చాటుకున్న ఐకాన్ స్టార్.. చిన్నారి ఫ్యాన్‌కు అల్లు అర్జున్ వీడియో కాల్

Caption of Image.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. లుకేమియాతో పోరాడుతున్న తన చిన్నారి అభిమాని శ్రద్ధ కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా నెరవేర్చారు. వీడియో కాల్‌లో ఆ చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడిన బన్నీ.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’ అనే డైలాగ్‌ను శ్రద్ధతో చెప్పించి పాప ముఖంలో చిరునవ్వులు నింపారు.

ఈ క్రమంలోనే పెద్దయ్యాక ఏమవుతావని బన్నీ అడగగా.. డాక్టర్ అవుతానని చిన్నారి చెప్పిన సమాధానంతో అల్లు అర్జున్ ఆనందించారు. ఈ సందర్భంలోనే త్వరగా కోలుకున్న తర్వాత హైదరాబాద్‌కు వచ్చి తనను కలవాలని బన్నీ ఆ చిన్నారిని ఆహ్వానించారు. ఈ ప్రత్యేక క్షణం మరింత మధురంగా మారింది.

చిరునవ్వులు పంచిన ఐకాన్ స్టార్..

ఈ వీడియోను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, అల్లు అర్జున్ చూపించిన మానవత్వాన్ని ప్రశంసించింది. అలాగే, అల్లు అర్జున్ టీమ్ సైతం స్పందిస్తూ.. ‘సినిమాలకు అతీతంగా చిరునవ్వులు పంచుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా శ్రద్ధతో మాట్లాడి, ఆ చిన్నారికి ఎప్పటికీ మరిచిపోలేని ఆనంద క్షణాలను అందించారు. ఆయన చూపించిన ఈ చొరవ, ప్రేమ, మానవత్వానికి నిదర్శనం’’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎంతో కూల్‌గా నవ్వుతూ చిన్నారితో మాట్లాడిన బన్నీ వీడియో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మేక్ ఏ విష్ ఫౌండేషన్‌కు సెలబ్రిటీ అంబాసిడర్‌గా ఉన్న అల్లు అర్జున్.. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల్లో ధైర్యం నింపేందుకు, వారి ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడానికి ఎప్పటి నుంచో తనవంతు సహాయం అందిస్తున్నారు. స్టార్‌డమ్ ఎంత పెరిగినా, ప్రజల జీవితాల్లో సంతోషాన్ని పంచాలనే ఆయన తపనకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. 

ALSO READ : దీపికా, ప్రియాంకలను వెనక్కి నెట్టిన నోరా ఫతేహి

సోమవారం ఏం జరగబోతోంది?

‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు బన్నీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చగా, అల్లు అర్జున్‌ను ఏ11గా పేర్కొన్నారు. దీంతో బన్నీ కోర్టు హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బన్నీ సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అల్లు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న AA23 స్టోరీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నట్లు టాక్.  వీటితో పాటు ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ మూవీ కూడా లైన్లో ఉంది. 

©️ VIL Media Pvt Ltd.