
హైదరాబాద్: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు విద్యా సంబంధిత సేవలను మరింత సులభంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ (WhatsApp) ఆధారిత స్కూల్ ఎడ్యుకేషన్ (Education) సేవలను ప్రారంభించింది. శుక్రవారం (జూన్ 19) హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు.
గత ఏడాదిగా వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్న విద్యా సేవల ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్ టికెట్ల డౌన్‌లోడ్, మార్కుల మెమోలు, పరీక్ష ఫలితాలు, పాత ఎస్‌ఎస్‌సీ మెమోలు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, ఎస్‌ఎస్‌సీ మెమో సవరణల వంటి సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు ఈ ప్రాజెక్టు రెండో దశలో విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు సమాచారం, ప్రీ-మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం సమాచారం, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలు, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాలపై తాజా అప్‌డేట్లు కూడా అందించనున్నారు.
ఈ డిజిటల్ వేదికను సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ (ITE&C) శాఖలోని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD)-మీ సేవా విభాగం అభివృద్ధి చేసింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ కార్యాలయాలకు తరచూ వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు, పేపర్‌వర్క్ కూడా తగ్గనుంది.
విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారం సులభంగా చేరవేయడానికి ‘పాలపిట్ట’ (Indian Roller) అనే ప్రత్యేక మస్కట్‌ను కూడా ప్రభుత్వం పరిచయం చేసింది. ఇది వాట్సాప్ ద్వారా ఆకర్షణీయమైన వీడియో సందేశాల రూపంలో వివిధ అప్‌డేట్లను అందించనుంది.
ఈ సేవలను పొందాలనుకునే వారు మీ సేవా వాట్సాప్ నంబర్ +91 80969 58096 ను సంప్రదించవచ్చు.