
లక్నో: అయోధ్య రామ మందిర విరాళాల్లో అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) ఆదివారం (జూన్ 21) సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సమర్పించింది. ఆరు రోజుల పాటు జరిపిన దర్యాప్తు వివరాలను సిట్ ముఖ్యమంత్రికి వివరించింది. అయోధ్య రామ మందిరంలో విరాళాల నిర్వహణలో వ్యవస్థాగత లోపాలు ఉన్నట్లు నివేదికలో సిట్ ఎత్తి చూపినట్లు సమాచారం. విరాళాల డబ్బును బ్యాంకులకు తరలించే యంత్రాంగంలో కూడా లోపాలు ఉన్నాయని సిట్ గుర్తించినట్లు తెలిసింది. విరాళాల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో గణనీయమైన మార్పులు, కఠినమైన పర్యవేక్షణ అవసరమని సిట్ సూచించినట్లు టాక్.
అయోధ్య రామ మందిర విరాళాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రామ మందిర ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి డబ్బు మాయమైందని ప్రతిపక్ష సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి. ఈ ఘటనపై విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
మరోవైపు.. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి.. వాస్తవాలను నిర్ధారించుకోవడానికి విచారణకు ఆదేశించాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాల డిమాండ్, ట్రస్ట్ అభ్యర్థన మేరకు రామ మందిర విరాళాల వివాదంపై యోగి సర్కార్ సిట్ విచారణకు ఆదేశించింది.
►ALSO READ | విద్యార్థుల కోసం మోడీ పెద్ద మనసు: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 45 నిమిషాలు ప్రధాని వెయిటింగ్..!
ఈ మేరకు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ముగ్గురు సభ్యులతో కూడిన సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వివాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సిట్‌ను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సిట్.. అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్‌కు సంబంధించిన విరాళాలు, ఆర్థిక నిర్వహణపై లోతుగా విచారణ చేపట్టింది.
ఇందులో భాగంగా ఆలయ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న పలువురు ఉద్యోగులు, సిబ్బందిని సిట్ విచారించింది. ఆరు రోజుల పాటు పలువురిని ప్రశ్నించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాంకేతిక, భౌతిక సాక్ష్యాలను పరిశీలించింది. ఆరు రోజుల విచారణ అనంతరం కేసుకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీఎంకు అందజేసింది సిట్. దీంతో సిట్ నివేదికలో ఏముంది..? ఎవరెవరి పేర్లు బట్టబయలు కాబోతున్నాయి..? సిట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.