Reading Time: < 1 minute
Prakash Raj Non Bailable Arrest Warrant Voter Id Case Bangalore

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు బెంగళూరు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారనే ఆరోపణలపై ఆయనకు బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్ – బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్‌పై బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ప్రకాష్ రాజ్ చట్టవిరుద్ధంగా ఒకే పేరుతో నాలుగు వేర్వేరు ఓటర్ ఐడీ కార్డులను కలిగి ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన బెంగళూరులోని 48వ ACJM కోర్టు, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఈ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశాయి.

కోర్టు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత వరుసగా రెండుసార్లు నాన్-బైలబుల్ వారెంట్లు ఇచ్చినా స్పందించకపోవడంతో, తాజాగా కోర్టు మూడోసారి ఆయనపై కఠినమైన నాన్-బైలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఆయన సినిమాల విషయానికి వస్తే.. ఒకవైపు వివాదాలు నడుస్తున్నప్పటికీ ప్రకాష్ రాజ్ వరుస సినిమాలతో బిజీగానే ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ (Drishyam 3) లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇటీవలే ఆయన తన షూటింగ్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకున్నారట. మరిన్ని చిత్రాలతో కూడా ఆయన బిజీగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో అరెస్ట్ వారెంట్‌ జారీ కావడం ఆయన్ను చిక్కుల్లో పడేసే అవకాశం ఉందని చెబుతున్నారు.