Reading Time: 2 minutes
Fifa World Cup 2026 Fever Reaches Norway Parliament Mps Recreate Viking Rowing Celebration

FIFA World Cup 2026 Fever Reaches Norway Parliament: ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫీవర్ అభిమానులకే కాకుండా.. రాజకీయ నాయకులనూ వదలడం లేదు. నార్వే జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు మద్దతుగా ఆ దేశ పార్లమెంట్‌లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నార్వే అభిమానులు ప్రాచుర్యంలోకి తెచ్చిన “వైకింగ్ రోయింగ్” (పడవ నడిపే చర్య)ను పార్లమెంట్ సభ్యులే అనుకరించడం సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

బోస్టన్‌లో జరిగిన వరల్డ్‌కప్ గ్రూప్-I మ్యాచ్‌లో నార్వే జట్టు ఇరాక్‌ను 4-1 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఎరుపు రంగు దుస్తులు ధరించిన నార్వే అభిమానులు, చాలామంది వైకింగ్ హెల్మెట్లు పెట్టుకుని తమ సముద్రయాన వారసత్వాన్ని గుర్తుచేస్తూ “వైకింగ్ రోయింగ్” ప్రదర్శించారు. బార్లు, ప్రజా రవాణా వాహనాలు, స్టేడియం పరిసరాలు, ఎస్కలేటర్లపై కూడా అభిమానులు ఒకే రీతిలో పడవ నడిపే కదలికలను చేస్తూ జట్టుకు మద్దతు తెలిపారు.

అభిమానుల ఈ వినూత్న మద్దతు పార్లమెంట్ సభ్యులను కూడా ఆకట్టుకుంది. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశంలో స్పీకర్ స్వల్ప విరామం తీసుకుని, దేశ జట్టుకు మద్దతుగా అభిమానులు చేస్తున్నట్లే “వైకింగ్ రోయింగ్” చర్యను సభ్యులందరూ అనుకరించాలని సూచించారు. దీంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు ఉత్సాహంగా స్పందించి, అందరూ ఏకమై ఆ చర్యను ప్రదర్శించారు.

ఈ సంఘటన నార్వేలో ఫుట్‌బాల్‌పై ఉన్న అభిమానాన్ని, జాతీయ జట్టుపై ఉన్న ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించారు. రాజకీయ భేదాలను పక్కనపెట్టి దేశ జట్టుకు మద్దతుగా పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికపై నిలవడం విశేషం. ఇక వరల్డ్‌కప్‌లో నార్వే తన తదుపరి గ్రూప్-I మ్యాచ్‌ను జూన్ 22న సెనెగల్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే నాకౌట్ దశకు అర్హత సాధించనున్నాయి.