
IPL 2026 Trades: ఐపీఎల్ వేడి ఇంకా చల్లారకముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి సమీకరణాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లక్నో సూపర్ జాయంట్స్ నుంచి రిషభ్ పంత్‌ను తిరిగి దక్కించుకోవడానికి, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను వదులుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమవడాన్ని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్రంగా తప్పుపట్టాడు. ఇది ఢిల్లీ యాజమాన్యం చేసే అతిపెద్ద తప్పిదమని హెచ్చరించాడు.
తెరపైకి సంచలన ట్రేడింగ్ వ్యవహారం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటికీ, వచ్చే సీజన్ కోసం జట్ల పునర్నిర్మాణ పనులు అప్పుడే మొదలైపోయాయి. గత సీజన్‌లో లక్నో జట్టు తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేక కెప్టెన్సీకి రాజీనామా చేసిన సౌత్‌పా బ్యాటర్ రిషభ్ పంత్, తిరిగి తన పాత ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ఈ భారీ ట్రేడింగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తమ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో పాటు అదనంగా రూ. 15 కోట్ల నగదును లక్నోకు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 27 కోట్ల భారీ ధర కలిగిన పంత్ కోసం కుల్దీప్‌ను వదులుకోవాలనే ఢిల్లీ నిర్ణయంపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది.
ఒకే ఒక్క సీజన్ ఆధారంగా అంచనా వేయొద్దు..
ఈ సంచలన ట్రేడింగ్‌పై మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఘాటుగా స్పందించాడు. “ఢిల్లీ జట్టు గనుక కుల్దీప్‌ను లక్నోకు పంపితే, అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఒక్క ఏడాది ప్రదర్శనను చూసి ఒక ఆటగాడి సామర్థ్యాన్ని తక్కువంచనా వేయలేం. పదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సీనియర్ ప్లేయర్‌ను ఒక్క సీజన్ ఫామ్ ఆధారంగా జడ్జ్ చేయవద్దని ఢిల్లీ కొత్త హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ కూడా ఎప్పుడూ చెబుతుంటారు. ఢిల్లీ యాజమాన్యం ఈ విషయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు కనిపిస్తోంది” అని కైఫ్ విశ్లేషించాడు.
కోల్‌కతా చేసిన తప్పే ఢిల్లీ కూడా చేస్తోందా?
DC is making mistake by trading @imkuldeep18 as told by @MohammadKaif pic.twitter.com/au58khUqL0
— Ravish Bisht (@ravishbofficial) June 20, 2026
గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా కుల్దీప్ యాదవ్ విషయంలో ఇలాగే తొందరపడిందని కైఫ్ గుర్తుచేశాడు. కోల్‌కతా జట్టు ఒక సీజన్ వైఫల్యం తర్వాత కుల్దీప్‌ను పక్కనబెడితే, ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని వేలంలో దక్కించుకుంది. ఆ తర్వాత చిన్న గ్రౌండ్‌లలో సైతం కుల్దీప్ ఎంత అద్భుతంగా రాణించాడో అందరం చూశామని, ఈ ఒక్క సీజన్ మినహాయిస్తే అతని రికార్డు అత్యంత అద్భుతమని కైఫ్ పేర్కొన్నాడు. క్లిష్ట సమయాల్లో కుల్దీప్‌కు ఎవరూ మద్దతుగా నిలబడటం లేదని, కోల్‌కతా జట్టుతో పాటు టీమ్ ఇండియాలో కూడా అతడిని చాలా సులభంగా పక్కనబెట్టేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఓటమికి ఒక్కడినే బాధ్యుడిని చేయడం తగదు..
గత సీజన్‌లో కుల్దీప్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టినప్పటికీ, 40 సగటుతో, 10.30 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. మిడిల్ ఓవర్లలో ఢిల్లీ వైఫల్యానికి ఇది ఒక కారణమే అయినప్పటికీ, మొత్తం జట్టు ఓటమి భారాన్ని ఒకే ఒక్కడిపై నెట్టేసి జట్టు నుంచి పంపించేయడం సరికాదని కైఫ్ అన్నాడు. కుల్దీప్ లాంటి విలక్షణమైన నైపుణ్యం కలిగిన బౌలర్ దొరకడం చాలా కష్టమని, జట్టు అతనికి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశాడు. యాజమాన్యం తీసుకునే ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు జట్టు భవిష్యత్తును దెబ్బతీస్తాయని హెచ్చరించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..