Reading Time: 2 minutes
Instant Cucumber Idli Recipe Weight Loss Breakfast

Cucumber Idli: ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే హడావుడిలో లేదా సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఏదైనా హెల్తీ స్నాక్ చేయాలన్నా ఇడ్లీ, దోస పిండి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. పిండి రుబ్బే ఓపిక, అది పులిసే వరకు వేచి చూసే టైం లేనప్పుడు కేవలం 20 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక అద్భుతమైన వంటకం ‘ఇన్‌స్టంట్ దోసకాయ ఇడ్లీ’ (Cucumber Idli). ఈ ఇడ్లీలు ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. ఈ క్విక్ అండ్ ఈజీ హెల్తీ ఇడ్లీల తయారీ విధానం, విశేషాలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

తాజా దోసకాయలు – 2

పచ్చి కొబ్బరి తురుము – 1 కప్పు

పచ్చిమిర్చి – 1

ఇడ్లీ రవ్వ – 1 కప్పు (250 ml)

పెరుగు (గట్టిగా ఉన్నది) – 2 టేబుల్ స్పూన్లు

అల్లం ముక్క (సన్నగా తరిగినది) – చిన్న ముక్క

కొత్తిమీర తరుగు – కొద్దిగా

ఉప్పు – 1 టీస్పూన్ (రుచికి సరిపడా)

నూనె లేదా నెయ్యి – ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి

తయారీ విధానం ఇదే..

ముందుగా రెండు దోసకాయల చివరలను కట్ చేసుకోవాలి. దీనికి తొక్క తీయాల్సిన అవసరం లేదు, నేరుగా తురుముకుంటే సరిపోతుంది. తురిమిన దోసకాయను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. దోసకాయలో ఉండే నీటిని పిండాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, ముక్కలుగా చేసిన ఒక పచ్చిమిర్చి వేసి నీళ్లు పోయకుండా ఒకటి లేదా రెండు సార్లు పల్స్ చేయాలి. ఇది మెత్తటి పేస్ట్‌లా కాకుండా కొద్దిగా బరకగా ఉండాలి. తురిమిన దోసకాయ ఉన్న బౌల్‌లో ఈ కొబ్బరి-మిర్చి మిశ్రమాన్ని వేయాలి. అందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, ఒక టీస్పూన్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు, ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. దోసకాయలోనే తగినంత తేమ ఉంటుంది కాబట్టి, ఇందులో అస్సలు నీళ్లు పోయకూడదు.

ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈ సమయంలో ఇడ్లీ రవ్వ, దోసకాయలోని తేమను పూర్తిగా పీల్చుకుని సాఫ్ట్‌గా మారుతుంది. 10 నిమిషాల తర్వాత మిశ్రమాన్ని మళ్లీ ఒకసారి కలపాలి. ఒకవేళ మరీ పొడిగా అనిపిస్తేనే ఒకట్రెండు చెంచాల నీళ్లు చిలకరించుకోవాలి, సాధారణంగా నీళ్ల అవసరం పడదు. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇడ్లీ మౌల్డ్స్‌లో పెట్టుకోవాలి. ఈ పిండి సాధారణ ఇడ్లీ పిండిలా జారుడుగా ఉండదు కాబట్టి, చేత్తో లేదా స్పూన్‌తో నీట్‌గా షేప్ చేస్తూ సర్దుకోవాలి. ఈలోగా ఇడ్లీ పాత్రలో నీటిని మరిగించి, నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ప్లేట్లను అందులో ఉంచి హై ఫ్లేమ్‌పై సరిగ్గా 8 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. అంతే. ఎంతో సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే వేడివేడి దోసకాయ ఇడ్లీలు రెడీ.

ముఖ్యమైన చిట్కాలు ..

ఇది ఇన్‌స్టంట్ రెసిపీ కాబట్టి పిండిని ముందుగానే కలిపి ఫ్రిజ్‌లో పెట్టడం వంటివి చేయకూడదు. అలా చేస్తే రుచి, టెక్స్చర్ మారిపోతాయి. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే ఫ్రెష్‌గా కలుపుకుని ఇడ్లీలు పెట్టుకోవాలి. ఈ వేడివేడి దోసకాయ ఇడ్లీలను ఫ్రెష్‌గా చేసిన టొమాటో చట్నీ లేదా మీకిష్టమైన మరేదైనా చట్నీతో తింటే కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు అకస్మాత్తుగా వచ్చినప్పుడు లేదా రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లకు భిన్నంగా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ దోసకాయ ఇడ్లీలు బెస్ట్ ఆప్షన్. తక్కువ టైమ్‌లో, ఎలాంటి ఒత్తిడి లేకుండా సులువుగా చేసుకోగలిగే ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.