Reading Time: 2 minutes
Tilak Varma Mohammed Siraj Issued Legal Notices Over Tg20 League Controversy

Tilak Varma, Mohammed Siraj Gets Legal Notices Over TG20 League: తెలంగాణ క్రికెట్ వర్గాల్లో టీజీ20 లీగ్ వివాదం సంచలనంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ (బీసీసీఐ) అనుమతి లేకుండా నిర్వహించబోతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ లీగ్‌కు మద్దతు ఇస్తున్నారనే కారణంతో టీమిండియాకు ఆడుతున్న తెలుగు ప్లేయర్స్, ప్రముఖ సినీ నటులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని టీసీఏ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గుర‌వా రెడ్డి తెలిపారు.

అక్రమ లీగ్‌కు ప్రచారం ఎందుకు?:

టీసీఏ ప్రధాన కార్యదర్శి గురవా రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహించాలనుకుంటున్న టీజీ20 లీగ్‌కు బీసీసీఐ నుంచి అనుమతులు లేవని ఆరోపించారు. అలాంటి లీగ్‌ను ప్రముఖులు ప్రచారం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. ‘టీజీ20 లీగ్‌ను చట్టబద్ధమైన టోర్నీగా చూపించేందుకు సెలబ్రిటీలను ఉపయోగిస్తున్నారు. ఇది వాటాదారులను, అభిమానులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం’ అని ఆయన విమర్శించారు. టీజీ20 లీగ్ గతంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL), తర్వాత టీటీఎల్ (TTL), అనంతరం టీజీ20 ప్రీమియర్ లీగ్ పేర్లతో మార్పులు చేసుకుంటూ వచ్చిందని టీసీఏ ఆరోపించింది.

కోర్టుకు వెళ్లే అవకాశం:

రాష్ట్ర స్థాయి ఫ్రాంచైజీ లీగ్ నిర్వహించాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రత్యేక గవర్నింగ్ కౌన్సిల్ ఉండాలని గురవా రెడ్డి అంటున్నారు. అలాగే లీగ్ ఛైర్మన్‌ను అసోసియేషన్ సాధారణ సభ ద్వారా ఎన్నుకోవాలని అన్నారు. అయితే టీజీ20 విషయంలో అలాంటి ప్రక్రియ ఏదీ పాటించలేదని ఆయన పేర్కొన్నారు. లీగల్ నోటీసులు పంపినప్పటికీ సంబంధిత సెలబ్రిటీలు టీజీ20 లీగ్‌తో తమ అనుబంధాన్ని కొనసాగిస్తే.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని టీసీఏ హెచ్చరించింది. ‘నోటీసులు పంపాం. అయినా సెలబ్రిటీలు ఈ లీగ్‌తో కొనసాగితే కోర్టులో కేసులు కూడా వేస్తాం’ అని గురవా రెడ్డి స్పష్టం చేశారు.

హెచ్‌సీఏపై మరో ఆరోపణ:

2021లో హైదరాబాద్ నగరానికి వెలుపల క్రికెట్ అభివృద్ధి కోసం హెచ్‌సీఏ, టీసీఏ కలిసి పనిచేయాలని బీసీసీఐ సూచించిందని.. అయితే ఆ ఆదేశాలను హెచ్‌సీఏ అమలు చేయలేదని టీసీఏ ఆరోపించింది. టీసీఏ జారీ చేసిన లీగల్ నోటీసులపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటి, మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, అంబటి రాయుడు స్పందించలేదు. టీజీ20 లీగ్ చుట్టూ నెలకొన్న ఈ వివాదం తెలంగాణ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీసీసీఐ అనుమతులు, లీగ్ చట్టబద్ధత, సెలబ్రిటీల ప్రమేయం వంటి అంశాలపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.