Reading Time: 2 minutes
Shreyanka Patil Ruled Out From Womens T20 World Cup 2026 Prema Rawat Replaces

Shreyanka Patil Ruled Out,Prema Rawat Replaces: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వరుసగా రెండు విజయాలతో జోష్‌ మీదున్న భారత మహిళల జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆఫ్‌స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైంది. నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. ఆమె కుడి కాలి మడమకు గాయమైంది. మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండదని వైద్య పరీక్షల అనంతరం నిర్ధారణ అయింది.

నెదర్లాండ్స్ మ్యాచ్‌లోనే గాయం:

బుధవారం నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా శ్రేయాంక పాటిల్ గాయపడింది. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించినప్పటికీ.. ఆమె ఆటను కొనసాగించలేకపోయింది. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీ20 ప్రపంచకప్ 2026కి దూరం కావాల్సి వచ్చింది. భారత స్పిన్ దళంలో కీలక బౌలర్‌గా ఉన్న శ్రేయాంక.. జట్టుకు దూరమవడం పెద్ద లోటుగా మారింది. ముఖ్యంగా టోర్నీ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో ఈ గాయం టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.

ప్రేమా రావత్‌కు అవకాశం:

శ్రేయాంక స్థానంలో యువ స్పిన్నర్ ప్రేమా రావత్‌ను భారత జట్టులోకి ఎంపిక చేశారు. ఈ మార్పుకు ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ అధికారిక ఆమోదం తెలిపింది. ‘శ్రేయాంక పాటిల్ గాయంతో టోర్నీ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో ప్రేమా రావత్‌ను భారత జట్టులోకి చేర్చేందుకు ఆమోదం తెలిపాం’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఇండియా-ఏ జట్టుతో ఉన్న ప్రేమా.. ఇప్పుడు సీనియర్ జట్టుతో చేరి ప్రపంచకప్ మిగిలిన మ్యాచ్‌ల్లో అందుబాటులో ఉండనుంది.

అంతర్జాతీయ అరంగేట్రానికి అవకాశం:

24 ఏళ్ల ప్రేమా రావత్ ఇప్పటివరకు భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. అయితే దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనలతో మంచి గుర్తింపు సంపాదించింది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రేమా.. 8 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. కేవలం 9.62 సగటుతో వికెట్లు తీయడం ఆమె ప్రతిభకు నిదర్శనం.

డబ్ల్యూపీఎల్‌లోనూ అనుభవం:

ప్రేమా రావత్ గత రెండు సీజన్లలో ఆర్సీబీ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడింది. మూడు వికెట్లు తీసిన ఆమె.. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడుతూ విలువైన అనుభవాన్ని సొంతం చేసుకుంది. అంతర్జాతీయ అరంగేట్రం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రేమాకు ఇప్పుడు ప్రపంచకప్ వేదికగా పెద్ద అవకాశం లభించింది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన శ్రేయాంక పాటిల్‌కు ఇది నిరాశ కలిగించే అంశం. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకుంది. మరోసారి గాయం వెంటాడటంతో ప్రపంచకప్ ప్రయాణం అర్థాంతరంగా ముగిసింది. జూన్ 21న ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.