Reading Time: 2 minutes
Gudivada Amarnath On Sai Krishna Lockup Death Can You Kill A Man For 1 2 Cases

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. సీఐపై హత్య కేసు నమోదు కావడం ద్వారా సాయికృష్ణ మరణం సహజ మరణం కాదని, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లేనని వ్యాఖ్యానించారు. 1-2 కేసులు ఉంటే ఒక మనిషిని చంపేస్తారా?.. చంపే హక్కు వాళ్లకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. తన కుమారుడు చనిపోతే కనీసం బూడిదైనా ఇవ్వండని ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటోందని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

‘సాయికృష్ణ తల్లి వ్యక్తం చేస్తున్న బాధను చూస్తే ప్రజల గుండెలు తరుక్కుపోతున్నాయి. తన కుమారుడు మరణిస్తే కనీసం అతడి బూడిదైనా ఇవ్వాలని తల్లి కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి అత్యంత బాధాకరం. ఒక వ్యక్తిపై ఒకటి లేదా రెండు కేసులు ఉన్నాయనే కారణంతో అతడిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. కృష్ణలంకలో జరిగిన ఈ ఘటన పోలీసు వ్యవస్థకు ఒక గుణపాఠంగా మారాలి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసులు నమోదు చేసి, నిందితులను చిత్రహింసలకు చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థే ప్రజల్లో భయాందోళనలు సృష్టించే పరిస్థితి రావడం దురదృష్టకరం’ అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ మరియు పోలీసు యంత్రాంగం పనితీరుపై మాజీమంత్రి అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. గతంలో ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా అరుదుగా జరిగాయి. ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోంది. ప్రజలు ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించాలి’ అని అమర్నాథ్ కోరారు.

‘సాయికృష్ణ కేసులో A1గా సీఎం చంద్రబాబు, హోంమంత్రిని పెట్టాలి. సీఐపై కేసు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాయికృష్ణ కేసు ప్రభుత్వం చేసిన హత్య. ఒక ఐజీ అధీనంలో ఉన్న కమిషనరేట్లో జరిగిన ఘటనపై ఎస్పీతో విచారణ చేయిస్తే నిజాలు బయటకు వస్తాయా. రాష్ట్రంలో జంగిల్ రాజ్ తెస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చూస్తే పెట్టుబడులు రావడం కాదు పెట్టెలు పట్టుకుని జనం రాష్ట్రం వదిలి పెట్టే పరిస్థితి వచ్చింది. కేసులు ఉంటే హత్య చేసే హక్కు మీకు ఎవరిచ్చారు. కృష్ణలంక స్టేషన్ చుట్టూ జూన్ 9 నుంచి హత్య వరకు జరిగిన ప్రతీ సీసీ ఫుటేజ్ జనం ముందు పెట్టండి’ అని మాజీమంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు.