Reading Time: 2 minutes

EPFOకి షాక్: PF రికవరీ నోటీస్ రద్దు.. రిటైర్డ్ ఉద్యోగికి తెలంగాణ హైకోర్టు ఊరట

Caption of Image.

రిటైర్ అయ్యాక చేతికి రావాల్సిన PF సొమ్ము సకాలంలో అందితే ఆ సంతోషమే వేరు. అయితే అలా అందిన సొమ్మును మళ్లీ వెనక్కి ఇచ్చేయండి అంటూ ప్రభుత్వ సంస్థ నోటీసు ఇస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఒక విశ్రాంత ఉద్యోగి. ఈ వివాదంలో తెలంగాణ హైకోర్టు ఉద్యోగికి అనుకూలంగా సంచలన తీర్పునిచ్చింది. కంపెనీ తప్పు చేస్తే ఆ సొమ్మును ఉద్యోగి నుంచి రికవరీ చేయడం కుదరదని స్పష్టం చేసింది.

అసలు కేసేంటి?
జె.వి. నృపేందర్ రావు అనే ఉద్యోగి 2023లో రిటైర్ అయ్యారు. ఆ సమయంలో ఆయనకు రావాల్సిన పీఎఫ్ బ్యాలెన్స్ నుంచి రూ.2 కోట్ల 50లక్షలను కంపెనీ చెల్లించింది. మరో రూ.70 లక్షలు రావాల్సి ఉండగా.. ఆ కంపెనీ పీఎఫ్ ట్రస్ట్ ఆ నిధులను యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం ఆ డబ్బు ఫ్రీజ్ అయి ఆగిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సదరు కంపెనీ అంతకుముందు వరకు మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్ట్ హోదాలో ఉండేది. కానీ మార్చి 1, 2023 నుండి ఆ హోదాను సస్పెండ్ చేయబడింది. 

రూల్స్ ప్రకారం ట్రస్ట్ హోదాను వదులుకున్నాక కంపెనీ తన వద్ద ఉన్న మొత్తం పీఎఫ్ నిధులను ఈపీఎఫ్‌ఓ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయాలి కానీ నేరుగా ఉద్యోగులకు ఇవ్వకూడదు. అయితే ఈ కంపెనీ మాత్రం ట్రస్ట్ హోదా వదులుకున్నాక జూలై 2023లో నృపేందర్ రావుకు రూ.2కోట్ల 50లక్షలు చెల్లించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈపీఎఫ్‌ఓ.. ఫిబ్రవరి 17, 2025న నృపేందర్ రావుకు రికవరీ నోటీసు పంపింది. కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించిందని.. కాబట్టి ఆ రూ.2కోట్ల 50లక్షలను 12% వడ్డీతో కలిపి 7 రోజుల్లోగా వెనక్కి కట్టాలని ఆదేశించింది. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ALSO READ : బంగారానికి ఏమైంది? ఆల్-టైమ్ హై నుండి అగాధంలోకి రేట్లు

హైకోర్టు తీర్పు.. ఎందుకలా అంది?
ఈ కేసును విచారించిన జస్టిస్ నాగేష్ భీమపాక నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఈపీఎఫ్‌ఓ ఇచ్చిన రికవరీ నోటీసును పూర్తిగా రద్దు చేసింది. కోర్టు తన తీర్పులో కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది:

* ఉద్యోగి తప్పు లేదు: కంపెనీ లేదా దాని పీఎఫ్ ట్రస్ట్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఆ బాధ్యత పూర్తిగా యాజమాన్యానిదే అవుతుంది. నృపేందర్ రావు ఎలాంటి మోసానికి లేదా తప్పుడు సమాచారానికి పాల్పడలేదు కాబట్టి ఆయన నుంచి డబ్బులు వసూలు చేయలేరని చెప్పింది.
* చట్టంలో రికవరీ రూల్ లేదు: కంపెనీ నిధులు బదిలీ చేయనప్పుడు.. సదరు మొత్తాన్ని ఉద్యోగి నుంచి రికవరీ చేయడానికి ఈపీఎఫ్ చట్టంలో ఎలాంటి ప్రత్యేక లీగల్ సెక్షన్ లేదని కోర్టు వెల్లడించింది.
* సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన: ఉద్యోగికి కనీసం ముందస్తు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా.. ఆయన వివరణ తీసుకోకుండా నేరుగా డబ్బులు కట్టమనడం చట్టవిరుద్ధం అని కోర్టు ఈపీఎఫ్ఓకు చురకలు వేసింది.

చివరగా కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందా లేదా అనే అంశంపై కోర్టు వ్యాఖ్యానించలేదు. ఒకవేళ చట్ట ఉల్లంఘన జరిగి ఉంటే.. ఈపీఎఫ్‌ఓ ఆ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని, అంతేకానీ రిటైరైన ఉద్యోగిని వేధించకూడదని స్పష్టం చేసింది. దాంతో సదరు విశ్రాంత ఉద్యోగికి ఊరట లభించింది.

©️ VIL Media Pvt Ltd.