
వైవిధ్యభరితమైన కథలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరో భారీ ప్రయోగానికి తెరలేపారు. ‘క’, ‘కె-ర్యాంప్’ చిత్రాలతో బ్యాక్-టు-బ్యాక్ విజయాలు అందుకొని మంచి ఫామ్‌లో ఉన్న కిరణ్, ఇప్పుడు సరికొత్త పాన్ ఇండియా ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో కలిసి విలక్షణ నిర్మాత ప్రేరణ అరోడా ఈ భారీ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
దర్శకుడిగా కాంతార నటుడు..
ప్రస్తుతం తాత్కాలికంగా ‘KA16’ అని పిలుస్తున్న ఈ చిత్రం ద్వారా, గతేడాది ‘కాంతార-ఛాప్టర్ 1’లో కీలక పాత్రలో నటించి మెప్పించిన శ్రీకాంత్ పుప్పాల దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇండస్ట్రీలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, బలమైన స్క్రిప్ట్ నమ్మి జీ స్టూడియోస్ వంటి పెద్ద సంస్థతో కలిసి వస్తున్నందుకు నిర్మాత ప్రేరణ అరోడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
మిస్టికల్ మైథాలజీ థ్రిల్లర్ తో..
ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న మైథాలజీ జోనర్‌కు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని జోడించి సరికొత్త కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సమాచారంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటించడానికి ఒక టాప్ బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేయబోతున్నారు. సౌత్-నార్త్ కాంబినేషన్‌తో సినిమాకు మరింత పాన్-ఇండియా క్రేజ్ రానుంది.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, అధికారిక టైటిల్‌ను మరికొద్ది రోజుల్లోనే సస్పెన్స్ వీడుతూ ప్రకటించనున్నారు.
బడ్జెట్ నియంత్రణలోనే…
ప్రస్తుతం ప్రేక్షకులు మైథాలజీ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు అని నిర్మాత ప్రేరణ అరోడా పేర్కొన్నారు. కేవలం ట్రెండ్ కోసం కాకుండా, దేవుడు మాకు ఇచ్చిన ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాం. అలాగే మలయాళ ఇండస్ట్రీ తరహాలోనే బడ్జెట్ నియంత్రణతో, కంటెంట్‌ను నమ్మి ఫేక్ కలెక్షన్స్ జోలికి వెళ్లకుండా జెన్యూన్ సినిమాగా దీనిని అందిస్తాం అని చెప్పారు.
ఫుల్ బిజీగా కిరణ్ అబ్బవరం
యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న కిరణ్ అబ్బవరం కేవలం కథపై నమ్మకంతోనే సినిమాలు ఎంచుకుంటారని నిర్మాత కొనియాడారు. ప్రస్తుతం కిరణ్ డైరీ ఫుల్ బిజీగా ఉంది.’ చెన్నై లవ్ స్టోరీ ‘సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఒక వినూత్న కాన్సెప్ట్‌తో కిరణ్ అబ్బవరం స్వయంగా దర్శకత్వం వహిస్తూ ఒక చిత్రాన్ని పూర్తి చేయబోతున్నారు. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సూపర్ హిట్ చిత్రం ‘క’కు సీక్వెల్‌గా మోస్ట్ అవేటెడ్ మూవీ ‘క 2′(KA 2) త్వరలోనే పట్టాలెక్కనుంది.