మన దేశంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ చాలా ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం మన దేశంలో దాదాపు 10.98 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా డయాబెటిస్ రోగులు ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అయితే, మనకు ప్రకృతి ప్రసాదించిన ఉసిరికాయతో రక్తంలో చక్కెర స్థాయిలను చాలా సులభంగా, సహజసిద్ధంగా అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు చూద్దాం..
ఉసిరికాయతో షుగర్ కంట్రోల్: మధుమేహ నియంత్రణలో ఉసిరికాయ (ఆమ్లా) ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరికాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక భోజనానికి ముందు ఒక పచ్చి ఉసిరికాయను తినడం అలవాటు చేసుకుంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకోవచ్చని తాజా శాస్త్రీయ అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

భోజనం తర్వాత పెరిగే షుగర్‌కు చెక్: డయాబెటిస్ ఉన్నవారిలో భోజనం చేసిన వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. దీనిని వైద్య పరిభాషలో ‘పోస్ట్-మీల్ గ్లూకోజ్ స్పైక్’ అంటారు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమగ్రంధి (ప్యాంక్రియాస్) పై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఇక భోజనానికి ముందు ఉసిరికాయను తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ ప్రక్రియ మందగించి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది: డయాబెటిస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం, భోజనానికి ముందు ఉసిరి తీసుకోవడం వల్ల అది ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ ప్రవాహాన్ని తట్టుకునేందుకు మన జీవక్రియను సిద్ధం చేస్తుంది. ఇక ఉసిరిలో ఉండే పాలీఫెనాల్స్ అనే సమ్మేళనాలు గ్లూకోజ్ మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. ఇది మధుమేహ బాధితులలో ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధం కావడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంపొందించడానికి బాగా సహాయపడుతుంది.
మధుమేహాన్ని నియంత్రించడంలో ఉసిరికాయ కేవలం ఒక సాంప్రదాయ చిట్కా మాత్రమే కాదు, ఇది సైంటిఫిక్‌గా నిరూపితమైన ఒక అద్భుతమైన ఆహార వ్యూహం. రోజువారీ జీవితంలో భోజనానికి ముందు ఒక ఉసిరికాయను తినే చిన్న అలవాటును అలవర్చుకుంటే, షుగర్ లెవెల్స్‌ను నిలకడగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా జీవించవచ్చు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. మధుమేహం ఉన్నవారు తమ డైట్‌లో ఎలాంటి మార్పులు చేసుకున్నా, లేదా ఉసిరికాయను క్రమం తప్పకుండా ఔషధంగా తీసుకునే ముందు ఒకసారి మీ వ్యక్తిగత డాక్టర్‌ను సంప్రదించి, మీ షుగర్ లెవెల్స్‌ను బట్టి సలహా తీసుకోవడం మంచిది
The post రోజు ఉసిరికాయ తింటే… మీ బాడీలో జరిగేది షాకింగ్ appeared first on Manalokam – Latest Telugu News & Updates.