Reading Time: < 1 minute

ఇన్‌స్టాగ్రామ్ లవ్.. పెళ్లి పేరుతో ఇద్దరు యువతులకు వల..రూ.12 లక్షలు, 2 తులాల బంగారం లూటీ

Caption of Image.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయమైన ఓ యువకుడు పెళ్లి పేరుతో ఇద్దరు యువతలను నట్టేట ముంచాడు. పెళ్లి పేరుతో ఏకంగా 12 లక్షల రూపాయల నగదు, రెండు తులాల బంగారాన్ని కాజేశాడు. ఈ  ఘరానా మోసం మెదక్ జిల్లాలో వెలుగుచూసింది.

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గేశ్ అనే యువకుడు.. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని మోసాలకు తెరలేపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో సాత్విక్ రెడ్డి, రిత్విక్ రెడ్డి అనే నకిలీ ఐడీలతో  ఇద్దరు యువతులకు వల వేశాడు. మాటలతో నమ్మించి, ప్రేమ పేరుతో వారికి దగ్గరయ్యాడు. ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.

రకరకాల అవసరాల పేరు చెప్పి విడతల వారీగా వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు.ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కొండి స్వాతి అనే యువతిని నమ్మించి రూ. 5 లక్షల నగదు, తులం బంగారం కాజేశాడు.
అలాగే, ఏక్లాస్పూర్ గ్రామానికి చెందిన మరో యువతిని బురిడీ కొట్టించి.. రూ. 7 లక్షల నగదు, తులం బంగారు ఉంగరం, చెవి కమ్మలను లాగేసుకున్నాడు.

నమ్మించి మోసం చేసిన ఈ కేటుగాడి వ్యవహారం టేక్మాల్‌ పరిధిలో ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే ఉదాహరణ. లవ్ ప్రపోజల్స్, మనీ రిక్వెస్ట్‌లతో వచ్చే ఫేక్ ప్రొఫైల్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.