
హైదరాబాద్ సిటీలో సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం ఎండ ఠారెత్తిస్తే.. సాయంత్రం చల్లబడి చిరు జల్లులు పలకరించాయి. బోడుప్పల్, పిర్జాది గూడ, ఉప్పల్, హబ్సిగూడ, నాచారం ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు బలపడేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
ఈ వారం దాటితే మాన్సూన్ మరింతగా విస్తరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐఎండీ చెబుతున్నది. ప్రస్తుతానికి రుతుపవనాలు బలహీనంగానే ఉన్నా.. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలుంటాయని పేర్కొంది. జులై 1 వరకు రాష్ట్రంలో ఉండే వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా వేడిగాలుల ప్రభావం, పశ్చిమ, తూర్పుగాలుల మధ్య హోరాహోరీ ఎఫెక్ట్‌తో రుతుపవనాలు స్తంభించిపోయాయి.
రాష్ట్రంలో ఈ రెండు వారాల పాటు సాధారణం కన్నా తక్కువ వర్షాలే పడుతాయని ఐఎండీ అంచనాల్లో పేర్కొంది. కేవలం కొంకణ్, గోవా, కర్నాటక, రాయలసీమ, కేరళ, తమిళనాడుల్లో మాత్రమే సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగతా దేశమంతా లోటు వర్షపాతమే రికార్డ్ అవుతుందని హెచ్చరించింది.
ALSO READ : ప్రియుడితో ఉన్నప్పుడు లేచి ఏడుస్తున్నాడంట..
అదే సమయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్స్ లాంటి పరిస్థితులు ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో వరుసగా ఈ మూడు రోజుల పాటు హీట్‌వేవ్స్ ఉంటాయని హెచ్చరించింది. చివరి వారంలో ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపింది.