
YS Jagan : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న ప్రేమ కేవలం బూటకమని, ఆయన పాలనలో రైతులకు మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే మిగిలాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా 143 హామీలలో ఏ ఒక్కటీ సరిగ్గా అమలు కాలేదని ఆయన సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ హయాంలో (2019-24) కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా 53.58 లక్షల రైతు కుటుంబాలకు నిరంతరంగా ‘రైతు భరోసా’ అందించామని, మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువగానే రైతులకు మేలు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రైతు భరోసా నిధుల కోత.. లబ్ధిదారుల తొలగింపు
పీఎం కిసాన్ (PM-KISAN) పథకానికి అదనంగా ప్రతి ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు తన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని జగన్ ఆరోపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అదనపు సాయం కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. అలాగే 2025-26లో రూ.20 వేలకు బదులు కేవలం రూ.14 వేలు మాత్రమే ఇచ్చారని, ఇక 2026-27లో రూ.26 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ఈ విధంగా మూడు సంవత్సరాలలో ప్రతి రైతుకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.19 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. దీనికి తోడు రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యను 53.58 లక్షల నుండి 46.85 లక్షలకు తగ్గించి, సుమారు 7 లక్షల మంది రైతులను పథకం నుండి అన్యాయంగా తొలగించారని, ముఖ్యంగా కౌలు రైతులు, పట్టాలున్న గిరిజన రైతులకు తీవ్ర అన్యాయం చేశారని జగన్ పేర్కొన్నారు.
ధరల స్థిరీకరణ నిధి నిర్లక్ష్యం.. బీమా రద్దు
రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదని, ధరల స్థిరీకరణ నిధిని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వైఎస్ జగన్ విమర్శించారు. తమ గత ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. వరి నుండి మామిడి వరకు పలు పంటల ధరలు దారుణంగా పడిపోయినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతులకు ఎంతో మేలు చేసే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి రైతులపై అదనపు భారం మోపారని, ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంటల బీమా కోసం రూ.7,802 కోట్లు చెల్లించామని జగన్ స్పష్టం చేశారు.
రైతు సంక్షేమ వ్యవస్థల నిర్వీర్యం
మోంథా తుపాను వల్ల సర్వస్వం కోల్పోయిన బాధిత రైతులకు ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎంతగానో ఉపయోగపడే సున్నా వడ్డీ రుణాల పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్బీకేలు (RBK), ఈ-క్రాప్ (e-Crop), , టెస్టింగ్ ల్యాబ్ వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా బలహీనపరిచిందని ఆరోపించారు.
ఆక్వా, మామిడి, పొగాకు రైతుల ఇబ్బందులు
ఆక్వా రంగంపై ప్రభుత్వం తీవ్రమైన భారం మోపిందని, మేత (ఫీడ్) ధరలు విపరీతంగా పెరిగిపోయి, రొయ్యల ధరలు పడిపోవడంతో ఆక్వా రైతులు భారీగా నష్టపోయారని జగన్ పేర్కొన్నారు. రైతుల నుండి ఒత్తిడి వచ్చిన తర్వాత కూడా ఫీడ్ ధరలను కిలోకు కేవలం రూ.2 మాత్రమే తగ్గించారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆక్వా రైతులకు ఇచ్చే కరెంటు సబ్సిడీని కూడా ఎగ్గొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మామిడి రైతులకు గతంలో ప్రకటించిన రూ.380 కోట్ల సాయాన్ని ఇప్పటికీ చెల్లించలేదని, ఈ ఏడాది కూడా వారిని మళ్లీ మోసం చేస్తున్నారని విమర్శించారు. అలాగే పొగాకు ధరలు పూర్తిగా కుప్పకూలినా ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి స్పందన లేదని, రైతాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని వైఎస్ జగన్ విమర్శించారు.