
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్లాపూర్‌లోని ముంబై-వడోదర హైవేపై అతి వేగంగా దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు ఢీవైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం (జూన్ 21) తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో టిట్వాలా నుంచి బద్లాపూర్ వైపు ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బీఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారు వేగం గంటకు సుమారు 250 కిలోమీటర్లు ఉంది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా.. శరీర భాగాలు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడ్డాయి. మృతులను బద్లాపూర్‌కు చెందిన యోగేష్ దిఘే, రికేబా జకాప్గా గుర్తించారు. ఆనంద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం అతను థానేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వీరంతా ఓ పుట్టిన రోజు వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బద్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం ప్రమాద స్థలాన్ని పరిశీలించి సాక్ష్యాలను సేకరించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.