Reading Time: < 1 minute
India A Vs Sri Lanka A Tri Series Final Schedule Match Report

ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. టైటిల్ పోరులో టీమిండియా-ఏ జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. లీగ్ దశలో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో శ్రీలంక-ఏ జట్టు సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. అఫ్గానిస్థాన్-ఏ జట్టుపై 103 పరుగుల భారీ తేడాతో లంక ఘన విజయం సాధించి, సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టుకు ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా, అవిష్క ఫెర్నాండో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అఫ్గాన్ బౌలర్లను ఆడుకుంటూ మొదటి వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. డిక్వెల్లా (66) అవుటైనా.. అవిష్క ఫెర్నాండో (110) అద్భుత శతకంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. నువానిదు ఫెర్నాండో (45) అతనికి చక్కని సహకారం అందించాడు. చివరి ఓవర్లలో రవిందు ఫెర్నాండో వేగంగా ఆడటంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 322 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ 4, సాఫి 3 వికెట్లు పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. ఫైనల్ చేరాలంటే ఈ టార్గెట్‌ను 29.3 ఓవర్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. కానీ రన్‌రేట్ ఒత్తిడిలో అఫ్గాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ హస్సన్ ఐసాఖిల్ (74), ఫార్మనుల్లా సాఫి (43) పోరాడినా ఫలితం లేకపోయింది. లంక బౌలర్ దులాజ్ 5 వికెట్లతో అఫ్గాన్ నడుం విరవగా, మథులన్ 3 వికెట్లతో చెలరేగాడు. దీంతో అఫ్గాన్ 42.5 ఓవర్లలో 219 పరుగులకే కుప్పకూలి టోర్నీ నుంచి నిష్క్రమించింది.