Reading Time: 3 minutes
Deewana Telugu Movie Review Rating Harshith Reddy

ప్రియదర్శి ‘మెయిల్’ సినిమాతో పాటు, సమంత నిర్మాతగా మారి చేసిన ‘శుభం’ సినిమాలో కీలక పాత్రలలో మెరిసిన హర్షిత్ రెడ్డి, హీరోగా మారి చేసిన సినిమా ‘దీవానా’. స్నేహ మణిమేఘలై హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, ప్రమోషనల్ కంటెంట్‌తో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దానికి తోడు గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు, అల్లు అర్జున్ స్వయంగా ప్రీమియర్స్ వేయమని హీరోకి సలహా ఇవ్వడం వంటివి సినిమా మీద అంచనాలను పెంచాయి. అయితే, ఈరోజే సమంత సినిమాతో పాటు రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ అయింది. కాకపోతే ఈ రోజు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.

దీవానా కథ
మున్నా (హర్షిత్ రెడ్డి) హైదరాబాదీ లోకల్ కుర్రాడు. తండ్రి నరేష్, తల్లి ఝాన్సీ కష్టపడుతుంటే అవేవీ ఒంటికి పట్టించుకోకుండా, తన స్నేహితులతో సరదాగా తిరుగుతూ ఉంటాడు. అలాంటి కుర్రాడి లైఫ్‌లోకి అమ్ము అలియాస్ అమూల్య (స్నేహ మణిమేఘలై) ఎంట్రీ ఇస్తుంది. ఆమెతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డ మున్నా, ఆమె పనిచేసే చోటికి వెళ్లి ప్రతిరోజు సైట్ కొడుతూ ఉంటాడు. ఈ విషయం అర్థమైన తర్వాత ఆమె, తనది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మున్నా కూడా గవర్నమెంట్ జాబ్ కొడితేనే ప్రేమను ఒప్పుకుంటానని కండిషన్ పెడుతుంది.

దీంతో ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో మున్నా కష్టపడతాడు. ఇక రేపు ఎస్ఐ సెలక్షన్స్‌కి వెళ్తాడు అనుకుంటూ ఉండగా, అతను గతంలో గొడవపడ్డ గ్యాంగ్ అతని మీద అటాక్ చేస్తుంది. మరి ఎస్ఐ సెలక్షన్స్‌కి మున్నా వెళ్లాడా లేదా? అతనికి జాబ్ వచ్చిందా లేదా? జాబ్ వచ్చాక కూడా అతనిని కలవకూడదని అమూల్య ఎందుకు ప్రయత్నించింది? అమూల్యను ప్రాణంగా ప్రేమించిన మున్నా ఏం చేశాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ
ఈ సినిమా ట్రైలర్, టీజర్ కంటెంట్ చూసినప్పుడు ఇది ఏదో రొటీన్ లవ్ స్టోరీ, సరదా సరదాగా సాగిపోయే స్టోరీ అనిపిస్తుంది. అంతెందుకు, కొన్ని డైలాగ్స్ వింటుంటే విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ కూడా గుర్తుకొస్తుంది. కాకపోతే ఆ సినిమాలకు ఈ సినిమాకి ఏమీ సంబంధం లేదు. వాస్తవానికి దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ చుట్టూ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నాడు.

సరదా సరదాగా తిరిగే కుర్రాడు ఒక అమ్మాయితో ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆ అమ్మాయి కోసం లైఫ్‌లో సెటిల్ అవ్వడం, ఆపై శుభం కార్డు వేయడం అనేది సర్వసాధారణంగా జరిగే రొటీన్ ఫార్మాట్ స్టోరీ. కానీ, దీనికి దర్శకుడు ఇంటర్వెల్‌లో ఒక షాక్ ఫ్యాక్టర్ పెట్టుకున్నాడు. అది రివీల్ అవ్వడంతో ఒక్కసారిగా ప్రేక్షకులందరూ ఆ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు.

ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక అసలు హీరో ఏం చేస్తాడు, లైఫ్‌లో ముందుకు ఎలా వెళ్తాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న క్రమంలో, సెకండ్ హాఫ్ అంతా కథను చాలా పర్ఫెక్ట్‌గా, ప్యాక్డ్‌గా రాసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా ఇదేదో నిబ్బా-నిబ్బీ లవ్ స్టోరీ అనిపిస్తుంది అని ఫీలైన వారందరూ కంటతడి పెట్టేలా, సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ క్యారీ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.
నిజానికి అతనికి ఇది మొదటి సినిమా అంటే కాస్త నమ్మడం కష్టమే, ఎందుకంటే ఎమోशंस ఆ రేంజ్‌లో వర్కవుట్ అయ్యేలా సీన్స్ రాసుకున్నాడు. వాస్తవానికి ఈ సినిమా థియేటర్‌లో అడుగుపెడుతున్న సమయంలో ఎవరికీ ఎలాంటి అంచనాలు ఉండవు. కానీ, సెకండ్ హాఫ్ ప్రారంభమైన కొద్దిసేపటికి గుండె బరువెక్కుతున్న ఫీలింగ్ కలిగేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

క్లైమాక్స్ సన్నివేశాలైతే యూత్‌కి, ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారికి కన్నీళ్లు తెప్పించకుండా ఉండవు. అదేవిధంగా తల్లిదండ్రులను, వారి కష్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కొడుకులకు కూడా చెంపపెట్టులా కొన్ని సీన్స్ రాసుకున్నాడు దర్శకుడు. ఓవరాల్‌గా ప్రేమలో సఫలమైనా, విఫలమైనా ముందుకు వెళ్లాలని, తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి కష్టాన్ని తెలుసుకుని ప్రయోజకులు అవ్వాలని యూత్‌కి ఒకపక్క మెసేజ్ ఇస్తూనే, మరోపక్క కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

నటీనటుల నటన & సాంకేతిక వర్గం
హర్షిత్ రెడ్డి లీడ్‌గా చేసిన మొదటి సినిమానే అయినా, ఎక్కడా తొందరపాటు లేకుండా చాలా పద్ధతిగా నటించాడు. హైదరాబాదీ గల్లీ కుర్రాడిగా ‘మున్నా’ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఈ మున్నా అనే పాత్ర హైదరాబాద్‌లో అనునిత్యం ఎదురుపడే సర్వసాధారణమైన క్యారెక్టర్ అని రియలిస్టిక్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్ స్నేహ టాలీవుడ్‌కి దొరికిన మరో టాలెంటెడ్ యాక్ట్రెస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె తన హావభావాలతో నటించిన తీరు కచ్చితంగా అభినందనీయం. అలాగే ఆమె స్నేహితురాలి పాత్రలో నటించిన సింధు కూడా ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో సఫలమైంది. హర్షిత్ రెడ్డి స్నేహితులుగా చేసిన ఇద్దరు కుర్రాళ్లతో పాటు నరేష్, రోలర్ రఘు, బలగం వేణు వంటి వారు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
ఇక సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే.. కథ, కథనాలు రెండూ ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ ఫీల్ తీసుకువచ్చింది. సాంగ్స్ బాగున్నాయి, స్క్రీన్ మీద కూడా చక్కగా ప్రెజెంట్ చేశారు. అయితే, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కీలకమైన సన్నివేశాలలో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటుంటే ఇది ఎక్కడో విన్నట్టుందే అనిపించేలా డిజైన్ చేయడం కొంత ఇబ్బందికర అంశం. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిడివి పరంగా ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ, సెకండ్ హాఫ్‌ను ఇబ్బంది లేకుండా నడిపించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఓవరాల్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే, ఈ ‘దీవానా’ గాడు నవ్విస్తూనే ఆలోచింపజేసి, కన్నీరు పెట్టించి పంపిస్తాడు!