Reading Time: 2 minutes
Ind Vs Afg 3rd Odi Harshit Rana Returns To India Squad Ahead Of Chennai Clash

India Update Squad vs Afghanistan 3rd ODI: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇప్పటికే 2-0 కైవసం చేసుకుంది. నామమాత్రమైన చివరి వన్డే మ్యాచ్‌ చెన్నైలో శనివారం (జూన్ 20) జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా గత కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మళ్లీ భారత జట్టులో చేరాడు. చెన్నైలో శనివారం జరిగే మూడో వన్డేకు ముందు అతడు జట్టుతో కలవడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

టీ20 ప్రపంచకప్ 2026కు ముందు ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా మోకాలి గాయానికి గురయ్యాడు. దాంతో అతడు ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగలేదు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఏ)లో పునరావాస ప్రక్రియ పూర్తి చేసిన హర్షిత్.. ఇప్పుడు పూర్తిగా ఫిట్‌గా మారాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు. ‘హర్షిత్ రాణా తన రీహాబిలిటేషన్ పూర్తి చేసుకుని చెన్నైలో భారత వన్డే జట్టుతో చేరాడు’ అని వెల్లడించారు.

24 ఏళ్ల హర్షిత్ రాణా ఇప్పటివరకు భారత్ తరఫున 14 వన్డేలు ఆడి 16 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 27.38 కాగా.. ఎకానమీ రేటు 6.21గా ఉంది. వేగం, బౌన్స్‌తో పాటు డెత్ ఓవర్లలో కూడా ప్రభావం చూపగల సామర్థ్యం అతనికి ఉంది. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారిగా ఆడాడు. ఇప్పుడు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడంతో తన ప్రతిభను మరోసారి నిరూపించుకునే అవకాశం పొందాడు. రాణాను భారత సెలెక్టర్లు రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ఎంపిక చేశారు. ఈ పర్యటనలో భారత్ మొత్తం ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిట్‌నెస్ నిరూపించుకున్న హర్షిత్‌కు ఇది కీలక సిరీస్‌గా మారనుంది.

అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా.