Reading Time: 2 minutes

సర్కార్‌‌‌‌ వర్సెస్ ఎస్‌‌‌‌బీఐ!…రాయదుర్గం భూమి వేలం అంశంలో వివాదం

Caption of Image.
  •     ముందు ప్రత్యామ్నాయ భూమికి ఒప్పుకున్న ఎస్‌‌‌‌బీఐ
  •     వేలం వేశాక కోర్టుకెక్కడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు
  •     ఎస్‌‌‌‌బీఐ పట్ల కఠిన వైఖరికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం 
  •     ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాల మార్పిడికి కసరత్తు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​లో అత్యంత ఖరీదైన రాయదుర్గం నాలెడ్జ్‌‌‌‌ సిటీ భూముల వేలం వివాదం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్  స్టేట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (ఎస్‌‌‌‌బీఐ) గా మారింది. ఈ వ్యవహారంలో ఎస్‌‌‌‌బీఐ తీరుపై నారాజ్​గా ఉన్న రాష్ట్ర సర్కారు.. బ్యాంకు పట్ల కఠిన వైఖరిని అవలంబించాలనే నిర్ణయానికి వచ్చినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 1న టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో రాయదుర్గం ప్రాంతంలోని 5.09 ఎకరాల భూమి రూ.1,038.36 కోట్ల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అంటే, ఎకరా భూమి దాదాపు రూ.204 కోట్ల ధర పలికింది. 

అయితే, ఈ వేలాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ ఎస్‌‌‌‌బీఐ హైకోర్టును ఆశ్రయించడం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి, అసంతృప్తికి కారణమైంది. ప్రత్యామ్నాయ భూమికి ముందు ఒప్పుకొని తీరా వేలం వేశాక అడ్డుకోవడం వెనుక కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వ పెద్దలు..  ఎస్‌‌‌‌బీఐతో దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్ని రకాల ఆర్థిక సంబంధాలను, లావాదేవీలను సమూలంగా పునఃసమీక్షించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు ఇప్పటికే ఎస్‌‌‌‌బీఐలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల డిపాజిట్లు, ప్రభుత్వ ఖాతాల పూర్తి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. 

ఎస్‌‌‌‌బీఐతో సంబంధాలు తెంచుకునే దిశగా.. 

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200కు పైగా శాఖలతో విస్తారమైన నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ కలిగి ఉన్న ఎస్‌‌‌‌బీఐ.. రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ ఆర్థిక లావాదేవీలలో అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల ఖాతాలు మెజారిటీ శాతం ఈ బ్యాంకులోనే ఉన్నాయి. ఉద్యోగుల జీతభత్యాలే కాకుండా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ రకాల సామాజిక సంక్షేమ పథకాల నగదు బదిలీలు, రైతు భరోసా , స్కాలర్ షిప్స్, ఆసరా పెన్షన్ల వంటి ప్రజా నిధుల చెల్లింపుల్లోనూ ఎస్‌‌‌‌బీఐ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రతినెలా యావరేజ్​గా రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల చెల్లింపులు ప్రభుత్వం చేస్తోంది. 

ఒకవేళ ప్రస్తుత రాయదుర్గం భూవివాదం కారణంగా ప్రభుత్వం ఆ బ్యాంకుతో ఉన్న సంబంధాలను తెంచుకుంటే అది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. కొత్త బ్యాంకుల్లోకి ఖాతాలను మార్చడం, సర్వర్ల అనుసంధానం వంటి సాంకేతిక ప్రక్రియలకు చాలా టైమ్​ పట్టనుంది. దీంతో సామాన్య లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. అయినా, ప్రభుత్వ భూములపై హక్కులను కాపాడుకునేందుకు ఎలాంటి కఠిన నిర్ణయానికైనా వెనకాడకూడదనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో ఎస్‌‌‌‌బీఐ యాజమాన్యం కోర్టు వెలుపల ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్తున్నారు.

ఇదీ వివాదం.. 

ఈ వివాదానికి ప్రధాన కేంద్రమైన రాయదుర్గం భూమి కేటాయింపుల వెనుక పెద్ద చరిత్రే ఉందని, నిబంధనలను ఎస్‌‌‌‌బీఐ పూర్తిగా ఉల్లంఘించిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. 2010లో కేవలం రూ.13.33 కోట్లు చెల్లించి ఎస్‌‌‌‌బీఐ ఈ 5.09 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని.. అయితే, నిబంధనల ప్రకారం రెండేండ్ల వ్యవధిలోనే అక్కడ ఒక భారీ కార్పొరేట్‌‌‌‌ కార్యాలయాన్ని నిర్మించాల్సి ఉందని చెబుతున్నారు. దశాబ్ద కాలం దాటినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఎస్‌‌‌‌బీఐ నిర్లక్ష్యం వహించిందని చెప్తున్నారు. మరోవైపు, ఈ భూమి ఇప్పటికీ చట్టబద్ధంగా తమ స్వాధీనంలోనే ఉందని, తమకు తెలియకుండా వేలం వేయడం చెల్లదని ఎస్‌‌‌‌బీఐ కోర్టును ఆశ్రయించింది. ఈ వేలానికి ముందు ఆ భూమికి బదులు వేరేచోట ప్రత్యామ్నాయ భూమిని తీసుకునేందుకు ఎస్‌‌‌‌బీఐ యాజమాన్యం ప్రాథమికంగా అంగీకరించిందని.. కానీ, తీరా వేలం ముగిసి భారీగా ఆదాయం వచ్చిన తర్వాత మాట మార్చి కోర్టుకు వెళ్లడం వెనుక కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.