
ఏలూరు: ఆ ఉపాధ్యాయులు కేవలం అక్షరాలు నేర్పే గురువులు మాత్రమే కాదు, ఆ పసిమొగ్గలు బడిబాట పట్టేందుకు తమ వంతు బాధ్యతను భుజానకెత్తుకున్న సహృదయులు. చదువుకోవాలన్న తపన ఉన్నా, కిలోమీటర్ల దూరం నడిచి రాలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం తమ సొంత డబ్బే పెట్టుబడిగా పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగుచూసిన ఈ హృదయపూర్వక ఉదంతం అటు విద్యా వర్గాల్లోనూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది.
వేడంగి స్కూల్లో చేరిన రాళ్లగుంట పిల్లలు
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం వేడంగి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్)కు ఈ విద్యాసంవత్సరం ఒక సరికొత్త ఉత్తేజం వచ్చింది. ఈ స్కూలుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాళ్లగుంట గ్రామం నుంచి ఈ ఏడాది కొత్తగా 12 మంది విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు తీసుకున్నారు. అయితే, అంత దూరం నుంచి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు ప్రతిరోజు నడక మార్గంలో బడికి రావడం ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారంగా మారింది. సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల పిల్లల హాజరు శాతంపై ప్రభావం పడే అవకాశం ఉందని పాఠశాల వర్గాలు గమనించాయి. విద్యార్థుల ఇబ్బందులను చూసి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దిరాజు చలించిపోయారు. చదువుకు దూరం కాకుండా ఈ 12 మంది పిల్లలను బడికి ఎలా రప్పించాలనే అంశంపై ఆయన తోటి ఉపాధ్యాయులతో చర్చించారు. హెచ్ఎం పెద్దిరాజు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉపాధ్యాయులంతా ఒక్కటయ్యారు. ప్రభుత్వ నిధులు, దాతల సహాయం కోసం వేచి చూడకుండా, తామే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
నెలకు రూ.6 వేల సొంత నిధులతో ఆటో సౌకర్యం
పిల్లలు క్షేమంగా, సమయానికి పాఠశాలకు చేరుకునేలా చూసేందుకు ఉపాధ్యాయ బృందం ఒక ఆటోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రాళ్లగుంట గ్రామం నుంచి విద్యార్థులను ప్రతిరోజూ స్కూలుకు తీసుకురావడం, మళ్లీ వదిలిపెట్టడం ఈ ఆటో బాధ్యత. ఇందుకోసం నెలకు అయ్యే రూ. 6, 000 ఆటో ఛార్జీలను ఉపాధ్యాయులే తమ సొంత జీతాల నుంచి భరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గురువుల ఔదార్యం వల్ల ఆ చిన్నారులు ఇప్పుడు ఎలాంటి అలసట లేకుండా ఉల్లాసంగా బడికి వస్తూ చదువుపై దృష్టి సారిస్తున్నారు. నిజమైన విద్యా దానం అంటే కేవలం పాఠాలు చెప్పడమే కాదు, విద్యార్థికి జ్ఞానాన్ని అందిందే మార్గంలో ఉన్న ముళ్ళను తొలగించడం కూడా అని వేడంగి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, డ్రాపౌట్లను తగ్గించడానికి ఉపాధ్యాయులు చేస్తున్న ఈ సేవలు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా మారాయి.