Reading Time: 3 minutes

Kitchen Telangana: టేస్టీ టమోటో.. వెరైటీ వంటకాలు.. రుచి అదరాల్సిందే..!

Caption of Image.

ఇంట్లో కూరగాయలు ఏమున్నా లేకపోయినా టొమాటోలు ఉంటే చాలు నడిపించేయొచ్చు వంట బండిని. ఆ… దాన్లో ఏముంది టొమాటో పప్పు, కూర, చారు. రసం ఇవే కదా… భలే బోర్ అనేస్తున్నారా. బోర్ కొట్టకుండా కాస్త వెరైటీ ట్రై చేస్తే సరి. వెరైటీ తిన్నట్టు ఉంటుంది.. నోటికి కొత్త రుచి కూడా అందుతుంది. అందుకని తెలంగాణ టొమాటో పూర్ణం, కన్నడ టొమాటో గొజ్జు, ఆంధ్రటొమాటో కర్రీ వండేయండి.

టొమాటో పూర్ణం తయారీకి కావాల్సినవి

  • టొమాటోలు (చిన్నవి): నాలుగు
  • పల్లీలు: ఒక చిన్న కప్పు
  • నువ్వులు: రెండుటీస్పూన్లు
  • జీలకర్ర: అర టీస్పూన్
  • పసుపు: చిటికెడు
  •  ఉల్లిపాయలు (పెద్దవి తరిగి): రెండు
  • చింతపండు: కొంచెం (నీళ్లలో నానబెట్టి)
  • కారం: రెండు లేదా మూడుటేబుల్ స్పూన్లు
  • బెల్లం: కొంచెం
  • కరివేపాకులు: కొన్ని
  • మెంతులు: కొన్ని
  • ఎండుమిర్చి: మూడు
  • నూనె సరిపడా 
  • ఎండు కొబ్బరి: కొద్దిగా 
  • పచ్చిమిర్చి: ఐదు
  •  గరంమసాలా: కొంచెం
  •  అల్లం పేస్ట్ :కొంచెం 

టొమాటో పూర్ణం తయారీ విధానం 

పాన్ వేడి చేసి పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి ముక్కలు వేగించాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా గ్రైండ్ చేయాలి. తరువాత అదే పాన్​ లో నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి చేయాలి. అవి కాస్త వేగాక ఉల్లి తరుగు వేసి దోరగా వేగించాలి. 

తరువాత పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేగించాక కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ వేసి.. పదినిమిషాలు ఉడికించాక ఉప్పు.. కారం వేసి కొన్ని నీళ్లు పోసి ఐదు నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించాలి. తరువాత చింతపండు రసం పోయాలి.

 పాన్ మీద మూత పెట్టి ఈ మిశ్రమాన్ని నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇప్పుడు టొమాటోలను నాలుగువైపులా కట్ చేయాలి. అలా చేసేటప్పుడు అడుగు వరకు కట్ కాకుండా చూసుకోవాలి. కట్ చేసిన వాటిని గ్రేవీలో వేసి పదినిమిషాలు ఉడికించాలి. తరువాత కొంచెంబెల్లం వేయాలి. చివర్లో గరం మసాలా పొడి చల్లితే రుచికరమైన టొమాటోపూర్ణం కూర రెడీ

టొమాటో కూర తయారీకి కావాల్సినవి

  •  టొమాటోలు (పెద్దవి): మూడు
  • ఉల్లిపాయలు (ఓ మాదిరి సైజ్​): రెండు (తరిగి)
  • పచ్చిమిర్చి (మధ్యకు చీల్చి): ఒకటి
  •  కరివేపాకులు: ఒక రెమ్మ
  • నూనె: రెండుటేబుల్ స్పూన్లు
  •  ఆవాలు, జీలకర్ర: ఒక్కోటి ఒక్కో స్పూన్ చొప్పన
  •  ఇంగువ: చిటికెడు
  •  కారం: ఒక టీస్పూన్ 
  • పసుపు పావు టీస్పూన్ 
  • ఉప్పు: రుచికి సరిపడా,
  • కొబ్బరి పాలు: పావు కప్పు
  •  పల్లీ గింజలు లేదా నువ్వుల పొడి: ఒకటిన్నర టేబుల్ స్పూన్

టొమాటో కూర  తయారీ విధానం

పాన్​ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు కరివేపాకులు, పచ్చిమిర్చి, ఇంగువ వేయాలి. తరువాత ఉల్లి తరుగు, ఉప్పు వేసి ఉల్లి ముక్కలు రంగు మారేవరకు వేగించాలి. ఇందులో టొమాటో తరుగు, పసుపు వేసి టొమాటో ముక్కలు ఉడికే వరకు మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించాలి. కారం, నువ్వుల పొడి లేదా పల్లీ పొడి వేసి బాగా కలిపి కూర చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కొబ్బరి పాలు పోసి కలిపి స్టవ్ ఆపేయాలి. ఈ కూరను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, చపాతీల్లో నంజుకుని తిన్నా యమ్మీగా ఉంటుంది.

టొమాటో గుజ్జు తయారీకి కావాల్సినవి

  • టొమాటో తరుగు: మూడు కప్పులు
  • ఉల్లిపాయ తరుగు ఒక కప్పు
  • నూనె: రెండు టీస్పూన్లు
  • మినప్పప్పు ఒక టీస్పూన్
  • ఆవాలు, జీలకర్ర: ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
  • ఇంగువ: చిటికెడు
  • పచ్చిమిర్చి: రెండు లేదా రుచికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్
  • ఉప్పు: ఒక టీస్పూన్

 రుచికి కావాల్సినవి

  • బెల్లం తురుము:   రుచికి సరిపడ
  • ఉప్పు ఒకటేబుల్ స్పూన్ 
  • నీళ్లు: కొన్ని 
  • కొత్తిమీర తరుగు: రెండు టేబుల్ స్పూన్లు

 మిక్సీ పట్టేందుకు

  • గసగసాలు : ఒక టీ స్పూన్​
  • తాజాకొబ్బరి తురుము: రెండు టీ స్పూన్లు
  • పుట్నాలపప్పు: రెండు టీ స్పూన్లు

 టొమాటో గుజ్జు తయారీ విధానం

 గసగసాలను నీళ్లలో పావుగంట నానబెట్టాలి. తరువాతకొబ్బరి తురుము, పుట్నాల పప్పు, నానబెట్టిన గసగసాలు కలిపి మెత్తటి పేస్ట్ పట్టి పక్కన పెట్టాలి. అవసరమనుకుంటే ఈ మిశ్రమం గ్రైండ్ చేసేటప్పుడు ఒక పచ్చి మిర్చి వేయొచ్చు. 

పచ్చిమిర్చిని నిలువుగా కోయాలి. పాన్ లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటమని అంటు న్నప్పుడు మినప్పప్పు, ఇంగువ, పసుపు వేయాలి. మినప్పప్పు లేత బంగారు రంగు వచ్చాక అందులో పచ్చిమిర్చి వేసి కాసేపు వేగించాలి. 

అందులో ఉల్లి తరుగు, అల్లం పేస్ట్ వేసి ఉల్లి ముక్కలు రంగు మారే వరకు వేగించి టొమాటో తరుగు వేసి, పాన్ మీద మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత బెల్లం తరుగు, ఉప్పు, కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి కలపాలి. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

 అవసరమనుకుంటే కొన్ని నీళ్లు కలపొచ్చు. పాన్ మీద మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. గరిటెతో బాగా కలిపి స్టవ్ మంటఆపేయాలి. కన్నడ మంటకం అయిన ఈ టొమాటో గొజ్జును చపాతీలు, పూరీలు, దోశెల్లో తింటే టేస్టీగా ఉంటుంది. పిజ్జా లేదా శాండ్ విచ్​ల  మీద టాపింగ్ కూడా వాడొచ్చు ఫ్రిజ్​లో పెడితే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది..

©️ VIL Media Pvt Ltd.