Reading Time: < 1 minute

అట్టహాసంగా TG 20 లీగ్ ఓపెనింగ్ సెర్మనీ.. హాజరైన భట్టి, సిరాజ్, రౌడీ బాయ్ విజయ్

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న TG 20 లీగ్ ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా జరిగింది. ఆదివారం (జూన్ 21) హైదరాబాద్‎లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, మాజీ క్రికెట్ అంబటి రాయుడు, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండి, ఈ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ హాజరయ్యారు. స్టార్ మ్యూజిక్ దర్శకుడు తమన్ ప్రత్యేక ప్రదర్శన టోర్నీ ఆరంభ వేడుకల్లో ఆద్యంతం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభ గల క్రికెటర్లను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ లీగ్ తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున టోర్నీ నిర్వాహకులను అభినందిస్తున్నామన్నారు. గతంలో క్రికెట్ అంటే అర్బన్ సెంటర్స్‎కు మాత్రమే అవకాశాలుండేవని.. మొదటిసారి ప్రతీ జిల్లాలో ఉండే క్రీడాకారులను గుర్తించి టీమ్స్‎ను సెలెక్ట్ చేసి నిర్వహిస్తున్న ఈ లీగ్ దేశానికి మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు.

►ALSO READ | బ్యాటింగ్ లో తడబడిన భారత మహిళల జట్టు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..!

నైపుణ్యం ఉన్న గ్రామీణ క్రీడాకారులకు టీజీ 20 లీగ్ అద్భుతమైన వేదిక అని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రపంచ ఫుట్‎బాల్ దిగ్గజం మెస్సీ ను హైదరాబాద్‎కి తీసుకొచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్‎లో స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురబోతున్నామని తెలిపారు. భవిష్యత్‎లో ఒలింపిక్స్‎లో తెలంగాణ నుంచి మెడల్స్ పొందేలా శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పునాదులు వేస్తుందని పేర్కొన్నారు. 

టీజీ20 బ్రాండ్‌ అంబాసిడర్‌ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. టీజీ- 20లో భాగస్వామ్యం అవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఒకప్పుడు క్రికెట్‌లో హైదరాబాద్‌ నుంచి తక్కువ మంది ఉండేవాళ్లన్నారు. హైదరాబాద్‌ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను చూసి గర్వపడేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి లీగ్ జరగడం వల్ల ఎంతో మందికి అవకాశం వస్తుందని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.