
న్యూఢిల్లీ: కేంద్రం బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో దేశంలోకి పసిడి దిగుమతులు భారీగా తగ్గాయి. గత నెల రోజుల్లో వాల్యూమ్ పరంగా ఏకంగా 70 శాతం పడిపోయి 25–30 టన్నులుగా రికార్డయ్యాయి. కాగా, ఈ ఏడాది మే 13 నుంచి బంగారంపై సుంకాల పెంపు అమల్లోకి వచ్చింది. సుంకం పెంచడానికి ముందు నెల రోజుల్లో 75-100 టన్నుల బంగారం దిగుమతి అయ్యింది.
అంతర్జాతీయంగా పసిడి ధరలు విపరీతంగా పెరగడంతో దిగుమతుల పరిమాణం తగ్గినా, విలువ పరంగా మే నెలలో బంగారం దిగుమతులు ఏడాది లెక్కన 34శాతం పెరిగి 3.41 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే కాలంలో బంగారం దిగుమతులు 60.14శాతం పెరిగి 9.04 బిలియన్ డాలర్లకు చేరాయి. 2025–26 లో వీటి విలువ 24శాతం పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరింది. వాల్యూమ్ పరంగా 4.76శాతం తగ్గి 721.03 టన్నులుగా నమోదయ్యాయి.