Reading Time: 3 minutes
Samantha Maa Inti Bangaram Movie Review Rating

చివరిగా ‘ఖుషి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సమంత, ఆ తర్వాత నిర్మాతగా మారి ‘శుభం’ అనే సినిమా తెరకెక్కించారు. అందులో చిన్న పాత్రలో మెరిసిన ఆమె, ఆ తరువాత నటనకు గ్యాప్ తీసుకున్నారు. అయితే, ‘ఓ బేబీ’ సినిమా సమంతతో చేసిన నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్‌గా ‘మా ఇంటి బంగారం’ అని ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సినిమా మీద ఆసక్తి నెలకొంది. దానికి తోడు, దీనికి కథను అందించింది కూడా సమంత భర్త కాదు, రాజ్ నిడుమూరు అని తెలియడం, సమంత స్వయంగా మరోసారి ఈ సినిమాని నిర్మించడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. అయితే, మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.

మా ఇంటి బంగారం కథ:
పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న అనిరుధ్ (దిగ్నాథ్ మంచాలే), తన చెల్లెలి పెళ్లి జరుగుతుందని తెలుసుకుని, ఆ పెళ్ళికి తన భార్య స్వర్ణ (సమంత)తో కలిసి సొంత ఊరికి వెళ్తాడు. ఆ ఊరికి వెళ్లే క్రమంలో, అనుకోకుండా ఆమె కరుణ (గుల్షన్ దేవయ్య) మనుషుల కంటపడుతుంది. సొంత ఊరికి వెళ్ళాక స్వర్ణ తన భర్త కుటుంబంలో కలిసిపోయే ప్రయత్నం చేస్తుండగా, మరోపక్క కరుణ ఆమెను ట్రేస్ చేసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తనకు వంట రాకపోయినా, తన స్నేహితురాలిని ఇంటికి పిలిపించుకుని మరి వంటలు చేసి బిజీగా ఉన్న స్వర్ణ, అనుకోకుండా కరుణ కారణంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ కారణంగా ఏకంగా కుటుంబానికే ఆపద ఏర్పడుతుంది. ఆ ఆపద ఏమిటి? అయితే, అసలు కరుణకు, స్వర్ణకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? కరుణ వల్ల స్వర్ణ ఎలాంటి ఇబ్బందులు పడింది? ఆపద నుంచి ఆ కుటుంబం గట్టెక్కిందా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
సమంత హీరోయిన్‌గా, నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబీ’ సూపర్ హిట్ కావడంతో, వాళ్ళిద్దరూ కలిసి మళ్లీ చేస్తున్న ఈ ‘మా ఇంటి బంగారం’ మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తూ ఉండడంతో సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులందరూ ఎదురుచూశారు. ఇక సినిమా ప్రారంభమయ్యాక స్వర్ణ పాత్రను ఒక హౌస్ వైఫ్ పాత్రగానే చూపిస్తూ వచ్చారు. మధ్య మధ్యలో ఆమె గతాన్ని టచ్ చేసి చేయనట్లుగా చూపిస్తూ, అసలు ఆమె ఎవరు, ఆమె గతం ఏమిటి అనే విషయం మీద అందరిలోనూ ఒక రకమైన ఉత్సుకత రేకెత్తించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.
ఇక నెమ్మదిగా కథలోకి తీసుకువెళ్లిన క్రమంలో, ఆమె గతాన్ని రివీల్ చేసి, తర్వాత ఏం జరగబోతోంది అనే విషయం మీద మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. కొంతవరకు అది వర్కౌట్ అయింది కూడా. ఇక ఆ తర్వాత సమంత చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యేలా కనిపించాయి. నిజానికి ప్రచారం చేసినట్లుగానే, ‘కలిసుందాం రా’ సినిమాకి ‘బాషా’ లాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కలిపితే ఈ సినిమాలానే అనిపిస్తుంది. కాకపోతే, ‘బాషా’ అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ కాకపోవడం సినిమాకి కాస్త మైనస్ అయ్యే అంశం. కాకపోతే, సమంత ఫ్యాన్స్ ఆశించిన అన్ని అంశాలు సినిమాలో ఉండేలా చూసుకోవడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయింది. మొదటి నుంచి చివరి వరకు కథ చాలా సాధారణంగా, ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం పుంజుకున్నప్పటికీ… కన్ఫ్యూజింగ్ విలన్ ట్రాక్ ఇబ్బందికర అంశం. సినిమాలో ఎమోషన్స్ సరిగ్గా పండలేదు.

నటీనటుల ప్రదర్శన:
నటీనటుల విషయానికి వస్తే, ఇది సమంత ‘వన్ ఉమెన్ షో’ మూవీ. పూర్తిగా ఆమె పాత్ర చుట్టూ రాసుకున్న కథతోనే సినిమా మొత్తం నడిపించే ప్రయత్నం చేశారు. సమంత ఈ పాత్రలో జీవించేసింది, ఆమె యాక్షన్ సీన్స్ అదరగొట్టింది. ఇక గుల్షన్ దేవయ్య కూడా కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన నటన సినిమాకి చాలా ప్లస్ అయింది, కాకపోతే డబ్బింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ఇక సమంత భర్త పాత్రలో నటించిన దిగ్నాథ్ మంచాలే సహా మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సమంత స్నేహితురాలి పాత్రలో నటించిన నటితో పాటు, శ్రీముఖి, గౌతమి వంటి పాత్రలు నవ్వులు పూయించాయి.

సాంకేతిక వర్గం:
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, సినిమా ప్రారంభమైనప్పటి నుంచి డైలాగ్స్ ఆకట్టుకునేలా రాసుకున్నారు. సమంత యాస కొంతవరకు తిరుపతి యాసను పోలి ఉండటంతో, ఆమె ఆ విషయంలో కొంచెం తడబడింది. మిగతా డైలాగ్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కథ విషయానికి వస్తే, నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఒక అమ్మాయి, అన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చేసే ప్రయత్నంగా ఒక ఆసక్తికరమైన లైన్‌తో ఈ కథ సిద్ధం చేసుకున్నారు. అది చాలావరకు ఎంగేజింగ్‌గానే సాగింది. అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), పాటలు బాగా ప్లస్ అయ్యాయి. సినిమా నిడివి (రన్ టైమ్) కూడా సినిమాకి కొంతవరకు ఇబ్బందికర అంశమే . ఇక సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్‌గా ఉంది, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ వర్డిక్ట్: ‘మా ఇంటి బంగారం’ – సమంత మార్క్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!