Reading Time: 2 minutes
Secunderabad Cantonment Renames British Era Roads After Indian War Heroes

Secunderabad: సికింద్రాబాద్‌ సైనిక పరిపాలన ప్రాంతమైన కంటోన్మెంట్ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఏళ్ల తరబడి బానిసత్వపు ఆనవాళ్లుగా మిగిలిపోయిన బ్రిటిష్ కాలం నాటి పేర్లను చెరిపేస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కంటోన్మెంట్ పరిధిలోని 21 ప్రధాన రోడ్లు, 3 బజార్లకు ఉన్న ఆంగ్లేయుల పేర్లను తొలగించి, వాటి స్థానంలో మన దేశ సార్వభౌమాధికారం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లు, దేశ గమనాన్ని మార్చిన మహనీయుల పేర్లను పెట్టాలని బోర్డు అధికారికంగా తీర్మానించింది. ఈ నూతన నామకరణాల్లో భాగంగా.. కార్గిల్ యుద్ధంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించి వీరమరణం పొందిన పరమవీరచక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా గౌరవార్థం ప్రసిద్ధ ‘వెల్లింగ్టన్ రోడ్డు’ పేరును ‘కెప్టెన్ విక్రమ్ బాత్రా రోడ్డు’గా మార్చారు. అలాగే గాల్వాన్ లోయ సరిహద్దు ఘర్షణల్లో చైనా సైనికులను వీరోచితంగా ఎదుర్కొని అమరుడైన తెలంగాణ గర్వకారణం, మహావీరచక్ర గ్రహీత కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు స్మృత్యర్థం బర్టన్ రోడ్డును ఇకపై ‘కల్నల్ సంతోష్ బాబు రోడ్డు’గా పిలవనున్నారు. ఎంతో కీలకమైన ‘ప్యాట్నీ రోడ్డు’కు లెఫ్టినెంట్ కల్నల్ ఏబీ తారాపూర్ పేరును ఖరారు చేశారు.

నగరంలో నిత్యం రద్దీగా ఉండే పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలోని ‘బోల్టన్ రోడ్డు’కు భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి పేరును పెట్టారు. అదేవిధంగా, దేశ సాంకేతిక రంగాన్ని శిఖరాగ్రాన నిలిపిన మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ పేరును ‘నోబెల్ రోడ్డు’కు పెట్టడం విశేషం. ముంబై 26/11 ఉగ్రదాడుల్లో బందీలను కాపాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అజరామర కీర్తిని స్మరిస్తూ ‘రిచర్డ్‌సన్ రోడ్డు’కు ఆయన పేరును పెట్టారు. దేశ స్వాతంత్య్ర సమరయోధులు, ఆధ్యాత్మిక గురువుల పేర్లు కూడా ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచాయి. ‘లిట్టన్ రోడ్డు’ ఇకపై ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు’గా, ‘కార్న్‌వాలిస్ రోడ్డు’ రూపాంతరం చెంది ‘స్వామి వివేకానంద మార్గ్’గా మారాయి. భారత సైన్యంలో మొదటి పరమవీర చక్ర గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ పేరును ‘గౌహ్ రోడ్డు’కు పెట్టగా, ‘బ్యామ్ రోడ్డు’కు ‘పరమహంస మార్గ్’గా నామకరణం చేశారు. దశాబ్దాలుగా దాస్యపు గుర్తులుగా నిలిచిన పేర్లను తొలగించి, స్వదేశీ వీరులకు సముచిత గౌరవం కల్పించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, దేశభక్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.