Reading Time: 2 minutes
Hisense E8s 144hz Uled Mini Led Tvs Launched In India Price Features And Specifications

Hisense E8S ULED Mini-LED: ప్రీమియం టెలివిజన్ విభాగంలో హిసెన్స్ (Hisense) భారత మార్కెట్లో కొత్త E8S 144Hz ULED Mini-LED TV సిరీస్‌ను విడుదల చేసింది. పనితీరు, ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరలతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ టీవీలను లాంచ్ చేసింది. ఆఫ్‌లైన్ మార్కెట్లో U7SE సిరీస్‌ను తీసుకువచ్చిన కంపెనీ, ఇప్పుడు ఆన్‌లైన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని E8S సిరీస్‌ను తీసుకవచ్చింది.

ఈ కొత్త టీవీల్లో ULED Mini-LED టెక్నాలజీతో పాటు Full Array Local Dimming ఫీచర్‌ను అందించారు. దీని వల్ల మరింత లోతైన బ్లాక్ లెవెల్స్, మెరుగైన కాంట్రాస్ట్, ఖచ్చితమైన బ్యాక్‌లైట్ నియంత్రణ లభిస్తుంది. అలాగే Hi-QLED Colour టెక్నాలజీ, Pantone ధృవీకరణతో కలర్ రిప్రొడక్షన్ మరింత సహజంగా, స్పష్టంగా కనిపించేలా రూపొందించారు. డిజైన్ పరంగా E8S సిరీస్ స్లిమ్ యూనిబాడీ నిర్మాణంతో వస్తోంది. టీవీల పనితీరును Hi-View AI Engine నియంత్రిస్తుంది. ఇది కంటెంట్‌ను విశ్లేషించి రియల్ టైమ్‌లో పిక్చర్ క్వాలిటీ, కాంట్రాస్ట్, కలర్ సెట్టింగ్స్‌ను సర్దుబాటు చేస్తుంది. 85 అంగుళాల మోడల్‌లో Hi-View AI Engine Pro అందుబాటులో ఉండి మరింత స్పష్టత, డీటెయిల్స్‌ను అందిస్తుంది.

గేమింగ్ ప్రియుల కోసం 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. దీని వల్ల వేగవంతమైన సన్నివేశాల్లో కూడా స్మూత్ మోషన్, తక్కువ బ్లర్, తక్కువ లేటెన్సీ అనుభవం లభిస్తుంది. VRR, ALLM, MEMC వంటి గేమింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఆడియో విభాగంలో Devialet ట్యూన్ చేసిన బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్‌ను అందించారు. 40W సౌండ్ అవుట్‌పుట్‌తో పాటు డాల్బీ ఆడియో, డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉండటంతో థియేటర్ తరహా ఆడియో అనుభూతిని అందిస్తుంది.

ఈ టీవీలు VIDAA Smart OS పై పనిచేస్తాయి. నెట్ఫ్లిక్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ OTT యాప్‌ లకు సపోర్ట్‌తో పాటు వాయిస్ కంట్రోల్, ఎనీ వ్యూ కాస్ట్, Odin బ్రౌసర్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDR10+ అడాప్టివ్, డాల్బీ విజన్ IQ, ఫిలింమేకర్ మోడ్, AI RGB లైట్ సెన్సార్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

హిసెన్స్ E8S సిరీస్ 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాలు, 85 అంగుళాల స్క్రీన్ పరిమాణాల్లో అందుబాటులోకి వచ్చింది. 4K UHD (3840×2160) రిజల్యూషన్, Quantum Dot టెక్నాలజీ, 178 డిగ్రీల వీయింగ్ యాంగిల్, Wi-Fi, Bluetooth 5.4, HDMI eARC వంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందించారు.

ధరలు:
* 55 అంగుళాల మోడల్ – రూ. 57,990
* 65 అంగుళాల మోడల్ – రూ. 76,990
* 75 అంగుళాల మోడల్ – రూ. 99,990
* 85 అంగుళాల మోడల్ – రూ. 1,59,990

ఈ టీవీలు కేవలం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వేదికలపై సేల్స్ కానున్నాయి. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా 18 నెలల వరకు No Cost EMI సదుపాయం, అలాగే ప్రత్యేక డిస్కౌంట్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

Image (3)