Reading Time: < 1 minute

అమరావతి క్వాంటం వ్యాలీలో అద్భుతం : మైనస్ 269 డిగ్రీల వాతావరణాన్ని సృష్టించి రికార్డ్

Caption of Image.

క్వాంటం టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.  అమరావతి క్వాంటం వ్యాలీ వేదికగా మైనస్ -269 డిగ్రీల సెల్సియస్ (-269°C) అత్యంత శీతల వాతావరణాన్ని సృష్టించి, క్వాంటం అప్లికేషన్ల తయారీలో దేశంలోనే సరికొత్త మైలురాయిని అధిగమించింది .అమరావతిలోని మేధా టవర్స్ క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్.. కేవలం 4 కెల్విన్, అంటే మైనస్ 269 డిగ్రీల అత్యంత శీతల ఉష్ణోగ్రతలను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత సంక్లిష్టమైన ‘డైల్యూషన్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీని ఏపీ సొంతం చేసుకుంది. క్వాంటమ్ కంప్యూటర్లు సజావుగా పనిచేయడానికి అవసరమైన అత్యంత చల్లటి వాతావరణాన్ని సృష్టించే ప్రత్యేక పరికరమే ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్. ఇకపై ఈ అత్యాధునిక సాంకేతికత కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసింది అమరావతి క్వాంటం వ్యాలీ.

ఇప్పుడు క్వాంటం హార్డ్‌వేర్ టెస్టింగ్‌లో యావత్ భారతదేశానికే తలమానికంగా నిలిచింది మన అమరావతి ఫెసిలిటీ సెంటర్. క్వాంటమ్ చిప్స్, సూపర్‌కండక్టింగ్ పరికరాలు, క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ కమ్యూనికేషన్ డివైజెస్,  క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్ వంటి నెక్స్ట్-జనరేషన్ పరికరాలను ఇక్కడే పరీక్షించే అద్భుత అవకాశం లభించింది.

గత ఏడాది సెప్టెంబర్‌లో మేథా టవర్స్, ఎస్ఆర్ఎం  యూనివర్శిటీల్లో ప్రారంభమైన ఈ క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్లు.. Qbit Force, Qubitech సంస్థల ఆధ్వర్యంలో కేవలం ఏడాది కాలంలోనే క్రయోజెనిక్ సాంకేతికతలో ఈ అసాధారణ ప్రగతిని సాధించాయి.

ఈ విజయంతో భారతదేశ క్వాంటం రంగంలో అమరావతి అత్యంత కీలకమైన హబ్‌గా మారబోతోంది. దాదాపు 85 శాతానికి పైగా క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను స్థానికంగానే తయారు చేసేందుకు మార్గం సుగమం అయింది. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లు, జాతీయ ల్యాబ్‌లు,  పరిశోధకులకు ఇకపై అమరావతే కేరాఫ్ అడ్రస్ గా మారనుంది. 

©️ VIL Media Pvt Ltd.