Reading Time: 3 minutes

Maa Inti Bangaram Review: ‘మా ఇంటి బంగారం’ రివ్యూ.. ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

Caption of Image.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ సారి రూటు మార్చేసింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఈ సారి యాక్షన్ మోడ్ లోకి వచ్చేసింది. ఓ బేబీ సినిమాతో సామ్కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’తో ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించగా, సంతోష్ నారాయణన్ సంగీతం, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించారు.

సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌‌పై నిర్మించిన ఈ మూవీ శుక్రవారం (జూన్ 19, 2026న) గ్రాండ్గా థియేటర్లలో విడుదలైంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఇపుడు ఎలాంటి కథతో వచ్చింది? సినిమా చూసిన ఆడియన్స్ స్పందన ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే: 

‘మా ఇంటి బంగారం’ కథలో సమంత లవ్ మ్యారేజ్ చేసుకుని ఓ గ్రామంలోని సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలోకి కోడలిగా అడుగుపెడుతుంది. కుటుంబ సభ్యుల అంచనాలు, శ్రీముఖితో వచ్చే సరదా సన్నివేశాలు, రోజువారీ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్‌తో కథ సాఫీగా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ సమయంలో సమంత గతానికి చెందిన వ్యక్తులు రావడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది.

ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌తో అసలు సమంత ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్లో ఆమె ఓ దళంలో చేరడానికి గల కారణాలు, గుల్షన్ దేవయ్యతో ఏర్పడిన పరిచయం, అక్కడి నుంచి ఎందుకు బయటకు వచ్చిందనే అంశాలను ఆసక్తికరంగా చూపించారు. సమంత గతం గురించి తెలుసుకున్న తర్వాత భర్త కుటుంబం ఎలా స్పందించింది? ఆమె జీవితంలో మళ్లీ ప్రవేశించిన గుల్షన్ దేవయ్యకు ఎలా ఎదురొడ్డి నిలిచింది? అన్నదే మిగతా కథ.

ఆడియన్స్ టాక్ ఎలా ఉంది?

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ ఎట్టకేలకు ఇవాళ జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు ఫస్ట్ షో నుంచే సోషల్ మీడియాలో మిక్సెడ్ టాక్ వస్తోంది. అయితే, సినిమా మొత్తం మీద అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ, సమంత నటనకు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి.

ప్రీ-ఇంటర్వెల్ వరకు కథ ఫ్రెష్‌గా, మంచి హ్యూమర్‌తో సాగిందని ప్రేక్షకులు చెబుతున్నారు. కొత్త కోడలి పాత్రలో సమంత నటన, తన డబ్బింగ్, క్లైమాక్స్‌లోని యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అభిప్రాయపడుతున్నారు. కుటుంబంతో కలిసి చూడదగ్గ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను పలువురు ప్రశంసిస్తున్నారు.

మరికొందరు మాత్రం ‘ఊహించదగ్గ కథ, నెమ్మదిగా సాగే కథనం’ అంటూ విమర్శిస్తున్నారు. అలాగే బలహీనమైన విలన్లు మరియు కథలో ఎమోషన్ బలం తక్కువగా ఉండటం సినిమాకు మైనస్ అని అంటున్నారు. అయితే సమంత నటనపై మాత్రం దాదాపు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తన సహజమైన నటనతో కథలోని వీక్ పాయింట్స్ని ఎక్కడ కనబడకుండా ఎంటర్టైన్ చేసినట్లు రివ్యూలు ఇస్తున్నారు. 

ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘మా ఇంటి బంగారం అద్భుతంగా ఉంది. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కామెడీ-యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చింది. కుటుంబంతో కలిసి థియేటర్లలో తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సమంత అద్భుతంగా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి రెండో హీరోలా నిలిచాడు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ బాగున్నాయి. సమంత స్నేహితురాలి పాత్రతో పాటు గుల్షన్ దేవయ్య సహా అందరూ చక్కగా నటించారు’అని పేర్కొన్నాడు.

మరో అభిమాని ‘మా ఇంటి బంగారం పర్‌ఫెక్ట్ సినిమా కాకపోయినా, ఇటీవల వచ్చిన కొన్ని పెద్ద హీరోల సినిమాల కంటే చాలా మెరుగ్గా ఉంది. అందరూ ఈ సినిమాను చూసి ప్రోత్సహించాలి’ అని అభిప్రాయపడ్డాడు.

అయితే మరోవైపు కొంతమంది ప్రేక్షకులు సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పరిచయమైన కథనే చాలా ఫ్లాట్‌గా, ఆసక్తి లేకుండా చెప్పడం జరిగింది. రెండో భాగం మొదటి భాగంతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, బలహీనమైన విలన్ ట్రాక్, ప్రభావం చూపలేని బ్యాక్‌స్టోరీ, ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాల కొరత సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. భావోద్వేగాలు కూడా అంతగా పనిచేయలేదు. సమంత తన పాత్రలో బాగానే నటించినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కథనం నిరాశపరిచాయి. మొత్తంగా ఇది యావరేజ్ కంటే తక్కువ స్థాయి సినిమా’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. 

నోట్: ఏ సినిమాకైనా పాజిటివ్, నెగిటివ్ రివ్యూలు రావడం సహజమే. అయితే, అవి ప్రేక్షకుల వ్యక్తిగత అభిరుచులు, అనుభవాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒక సినిమా గురించి పూర్తి స్థాయిలో అభిప్రాయం ఏర్పరచుకోవాలంటే, స్వయంగా థియేటర్‌కు వెళ్లి చూసి, ఆ అనుభూతిని ఆస్వాదించాల్సిందే. ఆ తర్వాతే సినిమా ఎలా ఉందనేది ఓ అంచనా వేయగలం. 

©️ VIL Media Pvt Ltd.