Reading Time: 3 minutes

తాగునీటికీ తిప్పలే..ఎల్నినో ఎఫెక్ట్తో  కష్టాలు  తప్పవేమోనన్నఆందోళన

Caption of Image.

ఇప్పటికే వట్టిపోయి కనిపిస్తున్న ప్రాజెక్టులు
డెడ్ ​స్టోరేజీకి చేరిన ఎల్లంపల్లి, మానేరు ప్రాజెక్టులు
జులై చివరి నాటికి వరదలు మొదలుకాకుంటే కష్టమేనని అభిప్రాయాలు

హైదరాబాద్/ కరీంనగర్, వెలుగు:ఎల్​నినో గండం తరుముకొస్తుండడంతో తాగునీటిపైనా ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లూ వట్టిపోయి కనిపిస్తున్నాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ఎగువన ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నా.. ఆ తర్వాత వర్షాలు, వరదలు రాకుంటే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి. పది రోజులుగా ఉన్నచోటు నుంచి కదలడం లేదు. 

అనువైన వాతావరణం లేకపోవడంతో.. కృష్ణా, గోదావరి నదుల పరివాహంలో చుక్క వర్షం కూడా పడడం లేదు. ఈ  రెండు నదుల జన్మస్థలం మహారాష్ట్రలో   పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ వర్షాలు పడితేగానీ.. ఆ రెండు నదులకు వరదలు మొదలయ్యే అవకాశం లేదు.  కానీ, అక్కడ ఇప్పుడప్పుడే వర్షాలు పడే దాఖలాలు కనిపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.

జులై చివరికల్లా వరదలు మొదలైతేనే.. 

వచ్చే 2 నెలల వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందుల్లేవని అధికారులు చెప్తున్నారు. నాగార్జునసాగర్​తో పాటు గోదావరిలోని పలు రిజర్వాయర్లలో తాగునీటికి సరిపడా నీళ్లున్నాయంటున్నారు. కానీ, జులై చివరి వరకు వరదలు మొదలు కావాలని, లేదంటే  హైదరాబాద్​కు తాగు నీటి కష్టాలు తప్పవంటున్నారు. ప్రస్తుతం నగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తుండడంతో దాదాపు ఖాళీ చేశారు. అక్కడి నుంచి నీళ్లు రావడం లేనట్టే. ఇక నాగార్జునసాగర్​ నుంచి రోజూ 1,500 క్యూసెక్కుల చొప్పున డ్రింకింగ్​ వాటర్​ కోసం సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 142.62 టీఎంసీల నీళ్లున్నాయి. డెడ్​స్టోరేజీ 112 టీఎంసీలు పోగా, మరో 32 టీఎంసీల  నీళ్లు ఉంటాయి. కాగా, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి సిటీకి ప్రస్తుతం 45 ఎంజీడీ(మిలియన్ ​గ్యాలన్స్​పర్​ డే) నీటిని తరలిస్తున్నారు. ఈ రిజర్వాయర్​ సామర్థ్యం 20.18 టీఎంసీలకు గాను 7.77 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. పై నుంచి వరదలు మొదలైతే తప్ప ఇక్కడి నుంచి సిటీకి సరఫరా చేసే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

డెడ్ స్టోరేజీకి మానేరు జలాశయాలు.. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కీలకమైన మానేరు జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. యాసంగి పంటల కోసం నీళ్లు వదలడం, మిషన్ భగీరథకు నీటి సరఫరా, తీవ్రమైన ఎండలకు నీరు ఆవిరవుతుండడంతో అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్​ల్లో నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. ఎల్ నినోతో వర్షాలు ఈసారి ఆశించిన స్థాయిలో కురిసే చాన్స్​ లేకపోవడం, వర్షాలు మరింత ఆలస్యం కానుండడంతో మానేరు జలాశయాలను నమ్ముకుని సాగు చేసే రైతుల్లో ఆందోళన నెలకొంది. సకాలంలో వర్షాలు కురవకపోతే తాగునీటికి సైతం తిప్పలు తప్పేలా లేదు. 

లోయర్ మానేరు డ్యామ్​లో 6 టీఎంసీలు.. 

కరీంనగర్​లోని లోయర్ మానేరు డ్యామ్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎల్ఎండీ నుంచి మిషన్ భగరీథ ద్వారా కరీంనగర్‌‌‌‌ రామడుగు సెగ్మెంట్‌‌‌‌, మానకొండూర్‌‌‌‌, హుజూరాబాద్‌‌‌‌, హుస్నాబాద్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి సెగ్మెంట్‌‌‌‌కు తాగునీరు సరఫరా అవుతోంది. తాగునీటి కోసం ప్రతి రోజూ 143 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా.. 90 క్యూసెక్కుల నీరు ఎండకు అవిరవుతున్నాయి. ఎల్ఎండీ డెడ్‌‌‌‌ స్టోరేజీ 5 టీఎంసీలు పోగా మిగిలింది ఒక్క టీఎంసీ మాత్రమే. వరద నీరు రాకపోతే నెల రోజుల్లో తాగునీటికి కటకట ఏర్పడే ప్రమాదముంది. 

మిడ్ మానేరులో 7.4 టీఎంసీలు.. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు డ్యామ్ లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 25.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టు కింద 53 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్సారెస్పీ ఆయకట్టు సాగు అవసరాల కోసం మిడ్ మానేరు నుంచే లోయర్ మానేరు డ్యామ్ కు నీరు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. 

అప్పర్ మానేరు, ఎల్లంపల్లిలోనూ డెడ్ స్టోరేజీ.. 

మిడ్ మానేరు మీద ఉన్న అప్పర్‌‌‌‌ మానేరు నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అర టీఎంసీ మాత్రమే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.8 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. వర్షాకాలం వచ్చినా రుతుపవనాల జాడ లేదు. ఇంకా ఎండాకాలం మాదిరిగానే ఉష్ణోగ్రతలు ఉండడంతో జలాశయాల్లో నీరు ఆవిరవుతోంది. ఈ వానాకాలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినాట్లు మరింత జాప్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

ప్రాజెక్టుల్లో నిరుడు.. ఇప్పుడు నీటి నిల్వ (టీఎంసీల్లో)..
ప్రాజెక్టు    పూర్తి సామర్థ్యం     ప్రస్తుతం    నిరుడు
ఆల్మట్టి    129.72    22.3    70.55
నారాయణపూర్​    37.64    24.81    29.84
తుంగభద్ర    105.79    9.9    38.61
జూరాల    9.66    7.18    7.54
శ్రీశైలం    215.81    42.21    76.32
నాగార్జునసాగర్​    312.05    142.62    139.09
జైక్వాడి    102.73    47.72    48.88
సింగూరు    29.92    4.54    19.44
నిజాంసాగర్​    17.8    6.74    5.81
శ్రీరాంసాగర్​    80.5    19.8    13.8
కడెం    3.5    0.38    0.7
ఎల్లంపల్లి    20.18    7.77    8.69
అప్పర్​మానేరు    2.2    0.66    0.66
మిడ్​మానేరు    27.55    7.4    6.9
లోయర్​ మానేరు    24.03    5.97    6.49 

©️ VIL Media Pvt Ltd.