
మీ ఫోన్ నెట్‌వర్క్ ఎటువంటి కారణం లేకుండానే ‘నో సర్వీస్’ అని చూపిస్తోందా? మీ చుట్టూ ఉన్నవారికి సిగ్నల్ అందుతున్నా, మీకే సమస్యగా ఉందా? అయితే ఇది సైబర్ నేరగాళ్ల సిమ్ స్వాప్ మోసానికి మొదటి హెచ్చరిక కావచ్చు. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ పాస్‌వర్డ్లు మరియు ఓటీపీలను హ్యాకర్ల నుండి కాపాడుకోవడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిమ్ క్లోనింగ్ మోసాల పట్ల మీరు ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం..
సిమ్ క్లోనింగ్ లేదా సిమ్ స్వాప్ అంటే..
సైబర్ నేరగాళ్లు మీ వ్యక్తిగత వివరాలను దొంగిలించి, మీ టెలికాం ఆపరేటర్లను సంప్రదించి, మీ నంబర్‌ను వారి ఆధీనంలో ఉన్న కొత్త సిమ్ కార్డుకు బదిలీ చేయించుకుంటారు. ఇలా జరిగిన వెంటనే మీ ఫోన్‌లోని సిమ్ పని చేయదు. నేరగాళ్లు మీ ఓటీపీలను (OTP) యాక్సెస్ చేయడం ద్వారా మీ బ్యాంక్ ఖాతాలు, ఈ-మెయిల్స్ మరియు సోషల్ మీడియా ఖాతాలను సులభంగా హ్యాక్ చేస్తారు.
ప్రమాదాన్ని గుర్తించడం ఎలా?
- నెట్‌వర్క్ కనెక్షన్ పోవడం: మీ ఫోన్ అకస్మాత్తుగా “నో సర్వీస్” లేదా “ఎమర్జెన్సీ కాల్స్ ఓన్లీ” అని చూపించడం మరియు అది చాలా సేపటి వరకు కొనసాగడం దీని ప్రధాన సంకేతం.
- కాల్స్, మెసేజ్‌లు రాకపోవడం: ఇతరులు మీకు కాల్స్ చేసినా లేదా మెసేజ్‌లు పంపినా మీకు అందకపోవడం గమనించాలి.
ఎలా కాపాడుకోవాలి?
- యాప్-ఆధారిత అథెంటికేషన్: వీలైనంత వరకు ఎస్ఎంఎస్ (SMS) ఓటీపీలపై ఆధారపడకుండా, గూగుల్ అథెంటికేటర్ వంటి యాప్-ఆధారిత అథెంటికేషన్ పద్ధతులను వాడండి.
- వ్యక్తిగత సమాచారం గోప్యత: మీ ఆధార్ సమాచారం, ఓటీపీలు, సిమ్ వెరిఫికేషన్ కోడ్లను ఎవరికీ ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా షేర్ చేయకండి.
- సిమ్ పిన్ (SIM PIN): మీ సిమ్ కార్డుకు సెక్యూరిటీ పిన్ సెట్ చేయడం ద్వారా అదనపు రక్షణ పొందుతారు.
- అకౌంట్ పర్యవేక్షణ: బ్యాంక్ స్టేట్‌మెంట్లను మరియు ఈ-మెయిల్ యాక్టివిటీని క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి.
వెంటనే చేయాల్సినవి..
ఒకవేళ మీ సిమ్ కార్డు హఠాత్తుగా పని చేయడం ఆగిపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ఫోన్ నుండి మీ టెలికాం ప్రొవైడర్‌కు కాల్ చేసి, మీ అకౌంట్‌పై ఎలాంటి సిమ్ రీప్లేస్‌మెంట్ రిక్వెస్ట్ జరగలేదని నిర్ధారించుకోండి. వెంటనే మీ బ్యాంక్ ఖాతా పాస్‌వర్డ్లను మార్చుకోండి మరియు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించండి. సరైన సమయంలో స్పందించడం వల్ల భారీ ఆర్థిక నష్టాలను నివారించవచ్చు. అప్రమత్తతే మీ డిజిటల్ భద్రతకు శ్రీరామరక్ష!