Reading Time: 2 minutes

చర్చలు విఫలమైతే కలలో కూడా ఊహించని రీతిలో దాడులు చేస్తం: ఇరాన్‎కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

Caption of Image.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‎కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతోన్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‎పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు. లెబనాన్‌లోని తమ హిజ్బుల్లా మిత్రపక్షాలను తక్షణమే అదుపులోకి తీసుకురావాలని ఇరాన్‌కు సూచించారు. లేదంటే ఈసారి దాడులు భయంకరంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. 

‘‘లెబనాన్‌లో ఇబ్బందులు సృష్టిస్తున్న తమ ప్రాక్సీలను ఇరాన్ వెంటనే ఆపాలి. ఒకవేళ వారు అలా చేయకపోతే గత వారం చేసినట్లే ఈసారి మరింత తీవ్రంగా ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తాం’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‏ఫామ్ ట్రూత్‎లో రాసుకొచ్చారు. ఓ వైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి  చర్చలు జరుగుతోన్న వేళ.. మరోవైపు ట్రంప్ ఇరాన్‎ను తీవ్రంగా హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. 

స్విట్జర్లాండ్‎లో చర్చలు స్టార్ట్:

అమెరికా, ఇరాన్ మధ్య పీస్ డీల్‎కు సంబంధించి ఈ వారంలో ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఎంవోయూపై సంతకాలు కూడా చేశారు. ప్రాథమిక ఒప్పందంలోని అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్ బృందాలు స్విట్జర్లాండ్‎ వేదికగా చర్చలు జరుపుతున్నాయి.

ఇందులో భాగంగానే ఆదివారం (జూన్ 21) స్విట్జర్లాండ్ వేదికగా ఇరుదేశాల మధ్య తుది దశ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా తరుఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీట్ విట్‎కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ హాజరయ్యారు. 

►ALSO READ | స్విట్జర్లాండ్‎లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు స్టార్ట్

ఇరాన్ తరుఫున స్పీకర్ మహ్మమద్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అటెండ్ అయ్యారు. మధ్యవర్తులుగా పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ముందు అమెరికా, ఇరాన్ బృందాలు పాక్ డెలిగేషన్‎తో సమావేశమయ్యాయి. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ తో ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యి చర్చించారు. 

ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సఫలమై పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడుతుందా..? లేక మిడిల్ ఈస్ట్ మళ్లీ మిస్సైళ్లు, బాంబుల మోతతో దద్దరిల్లితుందా అనేది చూడాలీ. ఒకవేళ చర్చలు విఫలమై ఒప్పందం కుదరకపోతే ఇరాన్‎పై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో స్విట్లర్లాండ్‎లో ఇరాన్, అమెరికా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

©️ VIL Media Pvt Ltd.