
రోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. జీ7 సదస్సులో తనతో ఫొటో కోసం మెలోని తెగా ఆరాటపడిందని.. తనను బతిమిలాడిందని మరోసారి అన్నారు ట్రంప్. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలకు మెలోని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీతో స్నేహం చేయడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని.. నా పాపులారిటీ మీపై ఆధారపడి లేదని స్పష్టం చేశారు.
తన ప్రజాదరణ ఇటలీ ప్రయోజనాలను కాపాడటంపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తన ప్రజాదరణ గురించి ట్రంప్‌కు అవసరం లేదని.. ఆయన పని ఆయన చూసుకుంటే మంచిదని చురకలంటించారు. తనపై ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యలు అర్థరహితమైనవని కొట్టిపారేశారు. ఇటలీలోని అమెరికన్ సైనిక స్థావరాల అంశం ఒప్పందాల మేరకు నియంత్రించబడుతుందని తన ప్రభుత్వ వైఖరిని సమర్థించుకున్నారు.
తాను ఎప్పుడూ ఇటలీ ప్రయోజనాల కోసమే పనిచేశానని.. తాను ఇటలీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం వాటిని ఉల్లంఘించలేరని తేల్చిచెప్పారు. ఇటలీ ఎప్పటికీ ఒక సార్వభౌమ దేశంగానే ఉంటుందని.. ఎవరి ముందు మోకరిల్లదని స్పష్టం చేశారు.
అసలు వివాదం ఏంటంటే..?
ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లే-బెయిన్స్ నగరంలో 2026, జూన్ నెలలో జీ7 సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ ఒక ఇటలీ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటలీ పీఎం జార్జియా మెలోని నా దగ్గరకు వచ్చి తనతో ఫొటో దిగాలని బతిమాలారని.. ఆమె బాధ చూడలేక, జాలిపడి నేను ఫొటోకు ఒప్పుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ట్రంప్ వ్యాఖ్యలకు మెలోని వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఫొటో కోసం ఎవరిని బతిమిలాడుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. నేను కానీ, నా దేశం ఇటలీ కానీ ఎవరి ముందూ మోకరిల్లవు.. ఎవరినీ బతిమాలవని కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ చెప్పేదంతా అబద్ధమని కొట్టేపారేశారు. ఇదిలా ఉండగానే.. ట్రంప్ మరోసారి ఇవే వ్యాఖ్యలు చేశారు.
జీ7 సదస్సులో మెలోని తనతో ఫొటో కోసం పదే పదే అడిగారని ఆరోపించాడు. అమెరికా, ఇరాన్‌ల మధ్య నడుస్తున్న సైనిక ఘర్షణల్లో ఇటలీ తమకు మద్దతు ఇవ్వలేదని, అందుకే ఇటలీలో మెలోని ప్రజాదరణ తగ్గిపోతోందని విమర్శించారు విమర్శించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో అమెరికా మిలిటరీ విమానాలు ఇటలీ రన్‌వేలను వాడుకోకుండా మెలోని అడ్డుకున్నారని.. ఇది తమకు పెద్ద ఇబ్బందిగా మారిందని ఆరోపించారు. తగ్గిపోతున్న ప్రజాధరణను పెంచుకునేందుకు మెలోని తనతో సఖ్యతగా ఉంటుందని ఆరోపించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మెలోని వెంటనే రియాక్ట్ అయ్యారు. ట్రంప్ వ్యాఖ్యలకు పై విధంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.