Reading Time: < 1 minute
Nagesh Patil Confirms Exit From Uddhav Sena Joins Shinde Camp

Uddhav Shiv Sena: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా షిండే శివసేనలో చేరడంపై స్పష్టత వచ్చింది. తిరుగుబాటు చేసిన ఉద్ధవ్ వర్గం ఎంపీలు త్వరలో ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపీ నాగేష్ పాటిల్ అష్టికర్ వెల్లడించారు. తన లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గంలో డెవలప్‌మెంట్ పనులకు నిధుల కొరత ఏర్పడిందని, అందుకే అధికార కూటమి శివసేనలో చేరుతున్నట్లు నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

హింగోలి ఎంపీ అయిన అష్టికర్ మాట్లాడుతూ.. తమకు ఉద్ధవ్ ఠాక్రే అంటే కోపం లేదని, నిధుల కోసమే షిండే శివసేనలో చేరుతున్నామని చెప్పారు. తాము సిద్ధాంతం విషయంలో రాజీ పడలేదని ఒక శివసేన నుంచి మరో శివసేనలో చేరుతున్నామని వెల్లడించారు. తనతో పాటు మరొకొందరు ఎంపీలు జూన్ 18వ తేదీ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ తమకు వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల వల్లే మనసు మార్చుకున్నట్లు తెలిపారు.

తమపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అవమానకరమైన భాష ఉపయోగించారని, ఆయన మాట్లాడే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తనను ఎన్నుకున్న ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అభివృద్ధి విషయంలో ఎంపీల్యాడ్ రూ. 5 కోట్ల నిధులు సరిపోవడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారని, అందుకే మాకు నిధులు కావాలని అన్నారు. ఉద్ధవ్ శివసేనకు మొత్తం 9 మంది ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేశారు. వీరిలో ఎంపీలు సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భావుసాహెబ్ వాక్చౌరే, నాగేష్ పాటిల్-అష్టికర్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ ఉన్నారు.