
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషాన్నపల్లిలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఊరికి కీడు సోకిందనే భయంతో గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి ఊరు వదిలి ఊరి బయట ఉన్న తోటలోకి వెళ్ళారు. ఉషన్న పల్లి గ్రామంలో గత రెండు నెలల్లో వివిధ కారణాలతో 15 మంది చనిపోయారు. ఒకరి దశదిన కర్మ కాకముందే మరొకరు చనిపోవడంతో ఊరికి ఏదో కీడు సోకిందని గ్రామస్తులు భయపడుతున్నారు.
ఊరికి కీడు సోకిందని భావించి ఇళ్లలో పొయ్యి వెలిగించకుండా, ఇళ్లకు తాళాలు వేసి ఊరి బయట ఉన్న తోటలోకి వెళ్లి అక్కడే వంటలు చేసుకొని తిని, రాత్రి పూట గ్రామస్తులు ఇంటికి వెళ్తున్నారు. ఇలా చేయడం వల్ల మరణాలు ఆగుతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. కంప్యూటర్ కాలంలో ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మడంపై మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలు ప్రజల్లో భయాన్ని మరింత పెంచుతున్నాయి.
శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ గ్రామాలు, పట్టణాల్లో కొందరు వ్యక్తులు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. తమకు కావాల్సిన వారికి చిన్న జ్వరం వచ్చినా చాలు.. ఎవరో మంత్రాలు, చేతబడి వంటివి చేశారని అనుమానం పెంచుకుంటున్నారు. ఈ అనుమానం రోజురోజుకు బలపడి చివరకు దాడులు చేసే వరకు వెళ్తోంది. ఈ దాడుల్లో కొందరు గాయాలతో బయటపడుతుండగా, మరికొందరు తాము చేయని తప్పుకు బలైపోతున్నారు.