
అధికారులు ఎంతగా దాడులు చేస్తున్నా.. నిఘానేత్రం ఎంతగా పనిచేస్తున్నా కల్తీ గాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు.. అలాంటి సెంటర్‌కు చెక్ పెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహేద్ నగర్‌లో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించి దాడులు నిర్వహించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో గోదాంపై దాడి చేసిన పోలీసులు, అక్కడ భారీ ఎత్తున అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. పరిశీలనలో భాగంగా పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలుపుతున్నట్లు బయటపడింది.
అలాగే పరిశుభ్రత లేకుండా తయారీ ప్రక్రియ నిర్వహించడం, నాసిరకం ముడి పదార్థాలను వినియోగించడం కూడా గుర్తించారు. దాడుల్లో భారీ మొత్తంలో తయారైన కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రసాయన పదార్థాలు, గ్రైండింగ్ యంత్రాలు, ప్యాకింగ్ మెషినరీ, ఖాళీ ప్యాకెట్లు, నకిలీ బ్రాండ్ స్టిక్కర్లు, లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రంలో తయారైన పేస్ట్‌ను ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ప్యాక్ చేసి నగరంలోని పలు కిరాణా దుకాణాలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
వీడియో చూడండి..
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అతనికి సహకరించిన ఇతర వ్యక్తుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఇటీవల నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన టాస్క్ ఫోర్స్ బృందాలు వరుస దాడులు నిర్వహిస్తున్నాయి. ప్రజలు కూడా ప్యాకెట్ ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, తయారీ తేదీ, బ్రాండ్ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు.
వీడియో చూడండి..