Reading Time: 2 minutes
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో దూరిన ఆవు.. పిల్లల దగ్గర బంతిని లాక్కొని ఏం చేసిందో చూస్తే..!

జంతువులు ఒక్కోసారి చేసే పనులు మనుషులను ఆశ్చర్యపరచడమే కాకుండా వినోదాన్ని కూడా పంచుతాయి. ముఖ్యంగా ఆవులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు మనుషులతో కలిసి ఆడుకోవడానికి ఇష్టపడుతుంటాయి. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఒక మైదానంలో పిల్లలు ఆడుకుంటున్న ఫుట్‌బాల్‌ను ఒక ఆవు లాక్కోవడమే కాకుండా, ప్రొఫెషనల్ ప్లేయర్‌లా ఆ బంతిని ఎవరికీ చిక్కకుండా కాపాడుకున్న దృశ్యం ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక ఖాళీ మైదానంలో కొందరు చిన్నపిల్లలు ఫుట్‌బాల్ ఆడుకుంటూ కనిపిస్తారు. అంతలోనే అక్కడికి ఒక ఆవు వస్తుంది. ఆట మధ్యలో ఫుట్‌బాల్ ఆ ఆవు కాళ్ల వద్దకు వెళ్లగా.. అది ఆ బంతిని తన రెండు కాళ్ల మధ్య ఉంచుకుని నిలబడింది. పిల్లలు తమ బంతిని తిరిగి తీసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆ ఆవు దాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. ఎవరైనా బంతిని లాక్కోవడానికి దగ్గరకు వస్తే.. ఆవు తన తలను ఊపుతూ వారిని భయపెట్టడం వీడియోలో చూడవచ్చు.

పిల్లలు ఆవు చుట్టూ తిరుగుతూ, చేతులు ఊపుతూ దాన్ని పక్కకు మళ్లించడానికి ప్రయత్నించారు. ఒక చిన్నారి ధైర్యం చేసి బంతిని కాలితో తన్నడానికి ప్రయత్నించగా, ఆవు ఎంతో చాకచక్యంగా బంతిని తన కాళ్లతోనే వెనక్కి నెట్టి డిఫెండ్ చేసుకుంది. ఆవు చేస్తున్న ఈ విన్యాసాలను చూసి మైదానంలో ఉన్నవారంతా నవ్వుకున్నారు. ఈ ఫన్నీ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతమైన లైకులు, కామెంట్‌లను సొంతం చేసుకుంది. సాక్షాత్తూ భారత స్టార్ క్రికెటర్ జస్పీత్ బుమ్రా కూడా ఈ వీడియోను చూసి ఫిదా అయిపోయారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ, ఈ రోజు నేను ఇంటర్నెట్‌లో చూసిన అత్యంత అద్భుతమైన విషయం ఇదే. క్రేజీ ఫుట్‌బాల్ స్కిల్స్ అని రాసుకొచ్చారు. నెటిజన్లు కూడా ఈ ఆవుకు ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో చోటు ఇవ్వాలి అని, మెస్సీ, రొనాల్డో కంటే ఈ ఆవు డిఫెన్స్ బాగుంది అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ న్యూస్‌ కోసం క్లిక్ చేయండి..