
- వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి భార్యల వెంటే వచ్చిన భర్తలు
- ఐదుగురు కౌన్సిలర్ల భర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ భర్త హాజరు
- చైర్పర్సన్ భర్త జోక్యంపై ఓ మహిళా కౌన్సిలర్ అభ్యంతరం
- చూసీచూడనట్లు వదిలేసిన మున్సిపల్ కమిషనర్ తీరుపై విమర్శలు
ఖమ్మం/ వైరా, వెలుగు: ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మహిళా కౌన్సిలర్లతో పాటు వారి భర్తలు కూడా హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. పాలకవర్గం రెండో సాధారణ సమావేశం శుక్రవారం మున్సిపాలిటీ మీటింగ్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ఆయా వార్డు కౌన్సిలర్లతో పాటు ఐదుగురు మహిళా కౌన్సిలర్ల భర్తలు, మున్సిపల్ చైర్పర్సన్ భర్త కూడా అటెండయ్యారు. 2వ వార్డు కౌన్సిలర్ శివకుమారి భర్త శ్రీనివాస్, 3వ వార్డు వేముల శ్రావణి భర్త రత్నాకర్, 6వ వార్డుకు చెందిన చైర్పర్సన్ కాపా చంద్రకళ భర్త మురళీకృష్ణ, 13వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి భర్త ముళ్లపాటి సీతారాములు, 17వ వార్డు కౌన్సిలర్ బత్తుల సుమతి భర్త ఏడుకొండలు, 20వ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి భర్త శ్యాంబాబు మీటింగ్ కు హాజరయ్యారు.
గత కొన్నేండ్లుగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు తప్ప మీడియాను కూడా కౌన్సిల్ సమావేశాల లోపలికి అనుమతి లేదు. కానీ, వైరాలో మాత్రం మహిళా కౌన్సిలర్ల భర్తలు కౌన్సిల్ హాల్లోకి అనుమతించడం, సమావేశం జరుగుతున్న సమయంలో ప్రత్యేకంగా వారికి కొన్ని చైర్లు వేసి కూర్చోబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా చైర్ పర్సన్ కాపా చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో 89 అంశాల అజెండాను ప్రవేశపెట్టారు. పలు అంశాలపై అధికార, విపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరగ్గా, 78 అంశాలపై తీర్మానాలను ఆమోదించి 11 అంశాలను తిరస్కరించారు.
చైర్ పర్సన్ భర్త జోక్యంపై మహిళా కౌన్సిలర్ అభ్యంతరం
కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు మున్సిపల్ చైర్ పర్సన్ చాంబర్లో మహిళా కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లోనూ చైర్ పర్సన్ భర్త కాపా మురళీకృష్ణ పాల్గొన్నారు. తమ వార్డులకు నిధులివ్వడం లేదని, వార్డు పర్యటనకు అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నా ప్రొటోకాల్ ప్రకారం తమకు సమాచారం ఇవ్వడం లేదని కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రస్తావించారు. దీంతో చైర్ పర్సన్ భర్త మురళీకృష్ణ జోక్యం చేసుకొని సమాధానం ఇచ్చారు.
అన్ని వార్డులను సమానంగా చూస్తున్నామని, వివక్ష లేదని చెప్పారు. దీంతో మహిళా కౌన్సిలర్ కట్టా స్వరూప రాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ చాంబర్లో ఉండగా, సమాధానం చెప్పేందుకు మీరెవరంటూ ప్రశ్నించారు. తనతో అవహేళనగా, అవమానకరంగా చైర్ పర్సన్ భర్త మాట్లాడారని స్వరూపరాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సభ్యులంతా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. కౌన్సిల్ మీటింగ్‌లోనూ భార్యల వెంట భర్తలు పాల్గొనడం, మున్సిపల్ కమిషనర్ కూడా అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తున్నది.