Reading Time: 2 minutes

నేడే నీట్ రీ-ఎగ్జామ్ ( 21-06-2026 ) దేశవ్యాప్తంగా హాజరుకానున్న .. 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు

Caption of Image.
  • నేడే నీట్ రీ-ఎగ్జామ్
  • దేశవ్యాప్తంగా హాజరుకానున్న 
  • 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు
  • కోటాలోని 92 ఎగ్జామ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
  • హైదరాబాద్​లో నీట్​ విద్యార్థిని ఆత్మహత్య
  • తల్లిదండ్రులను మెప్పించలేక పోతున్నానంటూ సూసైడ్​ నోట్

న్యూఢిల్లీ:  వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్ యూజీ’ రీ- ఎగ్జామ్ ఆదివారం దేశ, విదేశాల్లో అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనుంది. గతంలో జరిగిన నీట్ పరీక్షపై పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌టీఏ) మళ్లీ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. దీనికి  దేశ వ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే, దేశంలోనే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్తాన్‌‌లోని కోటాలో ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత పరీక్షలో కోటా నుంచి 38,614 మంది రాయగా.. ఈసారి ఆ సంఖ్య 32,715 కి పడిపోయింది. పేపర్ లీక్ గందరగోళం తర్వాత విద్యార్థులు తమ సొంత ఊర్లకు దగ్గరగా ఉన్న పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. కోటాలోని 92 పరీక్షా కేంద్రాలతో పాటు అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులు..సీసీటీవీ నిఘా, సిగ్నల్ జామర్లు, ప్రత్యేక పోలీసు బృందాలతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 

ఎన్‌‌టీఏ గైడ్ లైన్స్ ఇవే..

పరీక్ష రాయబోయే అభ్యర్థుల కోసం ఎన్‌‌టీఏ స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేసింది. దీని ప్రకారం..ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు (మొత్తం 195 నిమిషాలు) జరుగుతుంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు పూర్తిగా మూసివేస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రం లోపలికి రానివ్వరు. ఈసారి రఫ్ వర్క్ చేసుకునేందుకు ప్రశ్నాపత్రంలో గతంలో కంటే అదనంగా రెండు పేజీలు కలిపి మొత్తం నాలుగు పేజీలను ఇస్తున్నారు. అభ్యర్థులు పరీక్షకు వచ్చేటప్పుడు రీ-ఎగ్జామ్ కోసం కొత్తగా జారీ చేసిన అడ్మిట్ కార్డ్ కలర్ ప్రింట్అవుట్‌‌ను మాత్రమే తీసుకురావాలి. పాత హాల్ టికెట్లను అనుమతించరు. దాంతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా పాస్‌‌పోర్ట్ వంటివి) అసలైనది చూపించాలి. మొబైల్‌‌లోని డిజిటల్ కాపీలను అంగీకరించరు. దరఖాస్తు సమయంలో వాడిన రెండు అదనపు పాస్‌‌పోర్ట్ సైజు ఫొటోలను కూడా అభ్యర్థులు తమ వెంట ఉంచుకోవాలి.

డ్రెస్ కోడ్ విధింపు

పరీక్షా కేంద్రాల వద్ద కఠినమైన దుస్తుల నియమావళి (డ్రెస్ కోడ్) అమలులో ఉంటుంది. విద్యార్థులు లేత రంగు గల హాఫ్-స్లీవ్ షర్టులు లేదా టీ-షర్టులు, సాధారణ ప్యాంట్లు మాత్రమే ధరించాలి. పాదరక్షలుగా కేవలం సాధారణ స్లిప్పర్లు లేదా తక్కువ హీల్ ఉన్న శాండల్స్ మాత్రమే వేసుకోవాలి. బూట్లు, సాక్స్, ఫుల్-స్లీవ్ దుస్తులు, పెద్ద బటన్లు లేదా భారీ ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తులు పూర్తిగా నిషిద్ధం. ఉంగరాలు, గొలుసులు, చెవి పోగులు వంటి ఎలాంటి నగలను ధరించకూడదు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌‌వాచ్‌‌లు, క్యాలిక్యులేటర్లు, వాలెట్లు, బెల్టులు, ఎలాంటి కాగితాలను లోపలికి అనుమతించరు. హిజాబ్ లేదా టర్బన్ (తలపాగా) వంటి మతపరమైన దుస్తులు ధరించే వారు సమగ్ర తనిఖీల కోసం పరీక్షా కేంద్రానికి చాలా ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. మరో వైపు, పరీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే నకిలీ పేపర్ లీక్ పుకార్లు, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోచింగ్ సెంటర్లకు, విద్యార్థులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

©️ VIL Media Pvt Ltd.