Reading Time: < 1 minute

పెంచి పోషించిన పాముకే పాక్ బలవుతోంది!..యూఎన్లో పాక్కు మరోసారి బుద్ధిచెప్పిన భారత్

Caption of Image.

న్యూఢిల్లీ: యూఎన్​లో పాకిస్తాన్‌‌‌‌పై భారత్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆ దేశాన్ని ఒక ‘ఫ్రాంకెన్‌‌‌‌స్టైన్ దేశం’ గా అభివర్ణించింది. తాను పెంచి పోషించిన పాముకే ప్రస్తుతం ఆ దేశం బలవుతోందని చురకలంటించింది. యూఎన్ హైకమిషనర్ వార్షిక నివేదికపై జరిగిన సమావేశంలో పాక్ ప్రతినిధి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో.. యూఎన్​లోని భారత ప్రతినిధి అనుపమ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘రికార్డుల కోసం చెబుతున్నాను.. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే. 

ప్రస్తుతం ఉన్న ఏకైక పరిష్కారం కాని సమస్య ఏంటంటే.. భారత్‌‌‌‌కు చెందిన భూభాగాలను పాకిస్తాన్ ఆక్రమించుకోవడం, వాటిని తిరిగి భారత్‌‌‌‌కు అప్పగించడమే” అని అనుపమ సింగ్ స్పష్టం చేశారు. అలాగే, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌లో జరుగుతున్న దారుణాలను, ఇస్లామాబాద్ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆమె ఎండగట్టారు. ఇటీవల రావలాకోట్ లో జరిగిన హింసాత్మక నిరసనల్లో నలుగురు పోలీసులు సహా 11 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. 

దశాబ్దాలుగా సాగుతున్న సైనిక భూగ్రాబ్స్, జనాభా మార్పిడి, ప్రాథమిక స్వేచ్ఛను హరించడం వల్లే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ‘కనీసం తినడానికి తిండి, విద్యుత్, హక్కుల కోసం ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. వారిపై బుల్లెట్లు, క్రూరత్వాన్ని ప్రయోగిస్తున్నారు’ అని విమర్శించారు. టెర్రరిస్టులకు  ఆశ్రయం కల్పించడం, శిక్షణ ఇవ్వడం తమ ప్రభుత్వ విధానమని పాక్ రక్షణ మంత్రే స్వయంగా గొప్పలు చెప్పుకుంటారని అనుపమ సింగ్ గుర్తుచేశారు. 

‘అయినప్పటికీ పాకిస్తాన్ తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటుంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. తాను పెంచిన పామే తనను కరిచినప్పుడు ఆశ్చర్యపోయే ఒక ‘ఫ్రాంకెన్‌‌‌‌స్టైన్ దేశానికి’ పాకిస్తాన్ సజీవ ఉదాహరణ’ అని ఆమె మండిపడ్డారు.

©️ VIL Media Pvt Ltd.