Reading Time: 2 minutes

ఆ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన RBI.. మరి కస్టమర్ల డబ్బు సంగతి ఏంటి..?

Caption of Image.

సంపాదించిన డబ్బులు జాగ్రత్తగా ఉంటాయని బ్యాంకులో దాచుకుంటే.. అసలు ఆ బ్యాంకే క్లోజ్ అయిపోయింది. ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారడంతో.. కర్ణాటకకు చెందిన ‘శ్రీ మహాలక్ష్మి అర్బన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ బ్యాంక్’ లైసెన్స్‌ను RBI రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుండి ఈ బ్యాంకులో ఎలాంటి డిపాజిట్లు తీసుకోవడం గానీ, పాత డబ్బులు తిరిగి చెల్లించడం గానీ పూర్తిగా బంద్ అయిపోయాయి. దీంతో ఈ బ్యాంకులో డబ్బులు దాచుకున్న వేల మంది అయోమయంలో పడ్డారు.

అసలు ఆర్‌బీఐ ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందంటే.. ఈ శ్రీ మహాలక్ష్మి బ్యాంకు దగ్గర కస్టమర్లకు తిరిగి చెల్లించడానికి సరిపడా డబ్బు లేదు. భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు అస్సలు కనిపించడం లేదట. పైగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949 లోని రూల్స్ పాటించకుండా ఈ బ్యాంకు తుంగలో తొక్కిందని ఆర్‌బీఐ తేల్చేసింది. ఇలాంటి బ్యాంకును ఇంకా నడవనిస్తే.. ఉన్న డబ్బులు కాస్తా ఆవిరైపోయి డిపాజిటర్లు రోడ్డున పడతారని భావించిన రిజర్వు బ్యాంక్ వెంటనే కర్ణాటక సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను కలిసి.. బ్యాంకును పూర్తిగా మూసివేసి, లిక్విడేటర్‌ను నియమించాలని ఆదేశించింది.

►ALSO READ | ఇలాంటి ఆలోచనలు ఎట్లా వస్తాయ్ రా మీకు? మోసాలు చేసేందుకు హ్యాకర్‌ హైరింగ్.. కోట్లలో సంపాదన!

అయితే ఈ వార్త వినగానే సదరు బ్యాంకులో అకౌంట్లు ఉన్న కస్టమర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కానీ వారికి ఆర్‌బీఐ ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ బ్యాంకు మునిగిపోయినా.. దాదాపు 97.9 శాతం మంది డిపాజిటర్లకు తమ సొమ్ము మొత్తం నయా పైసాతో సహా తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే.. ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్’ ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం వీరికి పూర్తి క్లెయిమ్ లభిస్తుంది. కాబట్టి 97 శాతం మంది ఖాతాదారులకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు.

కర్ణాటకలోని గోకాక్‌లో ఉన్న ఈ బ్యాంకు స్టోరీ ప్రస్తుతానికి ముగిసింది. ఎంత కో-ఆపరేటివ్ బ్యాంకైనా సరే.. ఆర్‌బీఐ రూల్స్ బ్రేక్ చేస్తే తాట తీస్తాం అని సెంట్రల్ బ్యాంక్ మరోసారి నిరూపించింది. అందుకే బాస్.. బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేటప్పుడు ఆ బ్యాంక్ ట్రాక్ రికార్డ్ ఏంటో ఒక్కసారి చెక్ చేసుకోవడం బెటర్. 

©️ VIL Media Pvt Ltd.