Reading Time: 2 minutes
Fatima Sana Disappointed After Pakistans Narrow Defeat To South Africa In Womens T20 World Cup

Fatima Sana Reaction on PAKW Defeat vs SAW: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాకిస్థాన్ మహిళల జట్టు ఓటమిపాలైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన పాకిస్థాన్‌ను దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు రన్స్ చేసి గెలిచింది. ఈ ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ ఫాతిమా సనా నిరాశ వ్యక్తం చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లి ఓడడం చాలా బాధగా ఉందని.. ఇక టోర్నీలో తమని ఆ అల్లానే కాపాడాలని చెప్పుకొచ్చింది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఫాతిమా సనా.. జట్టులో పోరాట పటిమ ఉన్నప్పటికీ మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడంలో విఫలమయ్యామని అంగీకరించింది. ‘మేము చివరి వరకు పోరాడాం. మా ప్లేయర్స్ చివరి వరకు బాగా ఆడారు. కానీ మ్యాచ్‌ను ముగించలేకపోయాం’ అని తెలిపింది. ఈ మ్యాచ్‌లో ఫాతిమా సనా, టుబా హసన్‌తో కలిసి 71 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ భాగస్వామ్యం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌ చివరి వరకు క్రీజులో ఉండాలనే ఉద్దేశంతో మేము బ్యాటింగ్ చేశాం. మా సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. టుబా కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లలో ఒకరు. అందుకే ప్రణాళిక ప్రకారం ఆడేందుకు ప్రయత్నించాం’ అని వివరించింది.

బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత ముందుకు రావాల్సింది అనే ప్రశ్నకు ఫాతిమా సనా సమాధానం ఇచ్చింది. ‘అది పూర్తిగా జట్టు నిర్ణయం. మేమంతా కలిసి చర్చించుకున్న తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాం. జట్టు అవసరాలకు అనుగుణంగా నేను ఆ పాత్రను స్వీకరించాను’ అని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించడంతో పాటు మూడు వికెట్లు కూడా తీసిన ఫాతిమా.. కెప్టెన్‌గా తన బాధ్యతలను ఆస్వాదిస్తున్నానని చెప్పింది. ‘కెప్టెన్సీ బాధ్యతను నేను ఎంతో ఆస్వాదిస్తున్నాను. కానీ కేవలం వ్యక్తిగత ప్రదర్శనలు సరిపోవు. జట్టు విజయాలు సాధించాలి. టోర్నీలో ఇంకా మేం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. వరుసగా రెండు గేమ్స్ ఓడాం. ఇకనైనా విజయాల బాట పట్టాలి. లేదంటే మూల్యం చెలిచుకోవాల్సిందే’ అని తెలిపింది.

తదుపరి మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు స్పందించిన ఫాతిమా సనా.. జట్టు మరింత ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ‘మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అంకూలంగా లేనపుడు మరింత ప్రశాంతంగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆ అంశంలో మెరుగుపడేందుకు ప్రయత్నిస్తాం. పాక్ జట్టు విజయాలే నాకు ముఖ్యం’ అని పాక్ సారథి ఫాతిమా చెప్పుకొచ్చింది.