
మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రాంపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేసింది. టెలిగ్రాం యాప్ ప్రస్తుత రోజుల్లో నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులకు సురక్షిత స్థావరంలా మారిందని, ఇది దేశంలో ఒక కొత్త ‘డార్క్ వెబ్’గా రూపాంతరం చెందిందని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం కొన్ని నిజాలను, ఆందోళనకరమైన అంశాలను బయటపెట్టింది. చట్టాన్ని అమలు చేసే సంస్థల కళ్లు గప్పి నేరగాళ్లు ఈ యాప్‌ను ఎలా వాడుకుంటున్నారో పూర్తి వివరాలతో సహా న్యాయస్థానానికి వివరించింది.
టెలిగ్రాం కేవలం ఒక చాటింగ్ యాప్‌లా కాకుండా.. సమాజానికి ముప్పుగా మారిందని, అనేక అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సంచలనం సృష్టించిన NEET పేపర్ల లీకేజీ దగ్గర నుంచి సైబర్ మోసాలు, ఉగ్రవాద ప్రచారం, మాదకద్రవ్యాల రవాణా, భారీ ఆర్థిక నేరాల వరకు అన్నింటికీ టెలిగ్రాం వేదికవుతోందని కేంద్రం ఆరోపించింది. నేరస్థులు టెలిగ్రాం ఛానళ్లలో లింకులను పోస్ట్ చేస్తూ.. వాటి ద్వారా వినియోగదారులను డీప్ వెబ్, డార్క్ వెబ్ ఫోరమ్‌లకు మళ్లిస్తున్నారని, దీనివల్ల నిందితులను ట్రాక్ చేయడం అధికారులకు అత్యంత క్లిష్టంగా మారుతోందని పేర్కొంది.
టెలిగ్రాంలో ఉన్న మితిమీరిన ప్రైవసీ, ఎనానిమిటీ ఫీచర్లే క్రిమినల్ నెట్‌వర్క్‌ల విస్తరణకు కారణమైందని ప్రభుత్వం తెలిపింది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్లను, టెలిగ్రాం ఐడీలను దాచుకునేందుకు ఉన్న సెట్టింగ్స్ వల్ల.. ఆయా ఖాతాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించటం దర్యాప్తు సంస్థలకు సాధ్యం కావడం లేదని అఫిడవిట్‌లో పేర్కొంది. దీనికి తోడు.. తీవ్రవాద సంస్థలు సమాజంలో అశాంతిని ప్రేరేపించటానికి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టెలిగ్రాం వాడుతున్నాయి. అన్నింటికంటే ఘోరంగా.. చిన్నపిల్లలకు సంబంధించిన అశ్లీల కంటెంట్ కూడా ఈ యాప్‌లో యథేచ్ఛగా చెలామణి అవుతుండటం భద్రతా సంస్థలను కలవరపెడుతోందని భారత ప్రభుత్వం న్యాయస్థానానికి వెల్లడించింది.
►ALSO READ | Ravi Kishan: వైరల్ వీడియోతో చిక్కుల్లోపడ్డ ‘రేసుగుర్రం’ విలన్.. యోగా చేస్తూ గుట్కా నమిలారంటూ ట్రోల్స్!
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం.. ఇటీవలి కాలంలో టెలిగ్రాం ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై ఫిర్యాదులు భారీగా పెరిగాయి. సైబర్ కేటుగాళ్లు నకిలీ గుర్తింపులతో అకౌంట్లు తెరిచి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాల ద్వారా దోచుకున్న సొమ్మును దాచేందుకు అవసరమయ్యే మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను కూడా టెలిగ్రాం గ్రూపుల్లో బహిరంగంగా సాగుతున్నాయి. అంతేకాక హ్యాకర్లు టెలిగ్రాంను ఒక కమాండ్-అండ్-కంట్రోల్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చుకుని, మాల్వేర్ యాప్‌ల ద్వారా బాధితుల డేటాను దొంగిలిస్తున్నారు. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను సైతం దాటవేసే ప్రమాదకరమైన టూల్స్, నకిలీ ఆర్థిక యాప్‌ల లింకులు ఇక్కడ లభిస్తున్నాయి.
ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతకు కూడా టెలిగ్రాం పెద్ద ముప్పుగా తయారైందని కేంద్రం హెచ్చరించింది. గతంలో లీకైన డేటాబేస్‌ల ఆధారంగా పనిచేసే కొన్ని టెలిగ్రాం బాట్లు పౌరుల మొబైల్ నంబర్లు, ఐడెంటిటీ కార్డుల వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సులభంగా అందిస్తున్నాయని తెలిపింది. సైబర్ నేరాలతో పాటు, పైరసీ కంటెంట్ పంపిణీకి కూడా ఇది అడ్డాగా మారింది. సినిమా నిర్మాతల అనుమతి లేకుండా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఉచితంగా పంపిణీ చేస్తూ కాపీ రైట్స్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. మొత్తానికి టెలిగ్రాం ప్లాట్‌ఫారమ్ దేశ భద్రతకు, పౌరుల ప్రైవసీకి పెద్ద సవాలుగా మారిందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో తేల్చి చెప్పింది.