
దావనగెరె: కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. కండలు తిరిగిన బాడీ బిల్డర్ జిమ్ నుంచి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బాడీబిల్డర్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ఘటన మంగళవారం రాత్రి కేటీ జంబన్ననగర్‌లో జరిగింది. చనిపోయిన యువకుడిని కేటీజే నగర్కు చెందిన 26 ఏళ్ల సుశీల్ కుమార్‌గా గుర్తించారు. సుశీల్ రాష్ట్ర, జాతీయ స్థాయిలలో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నాడు.
అనేక అవార్డులు గెలుచుకొని, అంతర్జాతీయ బాడీబిల్డింగ్ ఈవెంట్ల కోసం సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఇలా జరగడంతో సుశీల్ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మంగళవారం రాత్రి 8:30 గంటలకు రోజూలానే సుశీల్ జిమ్లో వర్కౌట్లు ముగించుకుని ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన కాసేపటికే తనకు కళ్లు తిరుగుతున్నాయని తల్లికి చెబుతూనే కుప్పకూలిపోయాడు. అతని ఫ్యామిలీ వెంటనే సుశీల్ను ఆసుపత్రికి తరలించింది. అయితే.. ఆసుపత్రికి చేరుకునే లోపే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. లో బీపీ కారణంగా గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని వైద్యులు తెలిపారు.
సుశీల్ కుమార్ సంగతి పక్కన పెడితే.. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని, ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో యువత జిమ్‌లలో చేరుతున్నారు. అక్కడ కండలు తిరిగిన సీనియర్ల బాడీలను చూసి, తాము కూడా తక్కువ సమయంలో అదే స్థాయిలో బాడీని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. కండలు తిరిగిన శరీరం కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది.
ALSO READ : 3 నెలలుగా వెంటాడి వేటాడి సీఐ నాగరాజు కొడుతున్నాడు..
సిక్స్ ప్యాక్ మోజులో పడి ప్రమాదకర ఇంజక్షన్లు తీసుకుంటోంది. జిమ్లలో కొందరు కోచ్‌లు చెప్పే మాయమాటలు నమ్మి హార్ట్ ఫెయిల్యూర్కు దారి తీసే ప్రమాదకరమైన మెఫెంటెర్మిన్ సల్ఫేట్ ఇంజక్షన్లను రోజూ తీసుకుంటున్నారు. దీంతో చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు. మరికొందరు సడెన్ కార్డియాక్ అరెస్టులను కొనితెచ్చుకుంటున్నారు.