Reading Time: 2 minutes
How Us Iran Peace Deal Benefits India Crude Oil Prices Petrol Economy

US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం పశ్చిమాసియాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలికింది. ఇరు దేశాల మధ్య కుదిరిన MoUతో అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగిపోవడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌ను చల్లబరిచాయి. ఫలితంగా, గతంలో $100 మార్కును దాటి ఉడికించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో 1.13% క్షీణించి బారెల్‌కు $78.65 వద్దకు పడిపోయింది. అలాగే అమెరికన్ డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ సైతం 2.20% తగ్గి బారెల్‌కు $75 వద్ద ట్రేడ్ అవుతోంది. తన చమురు అవసరాలలో దాదాపు 85% దిగుమతుల పైనే ఆధారపడే భారత్‌కు, ఈ ముడి చమురు ధరల పతనం ఊహించని వరంలా మారింది. ఈ అంతర్జాతీయ డీల్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుడికి చేకూరనున్న 5 ప్రధాన ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. పెట్రోల్, డీజిల్ ధరల ఉపశమనం

హర్మూజ్‌ జలసంధి మూసివేత కారణంగా ఇటీవల భారత్‌లో కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు లీటరుకు సుమారు రూ. 7 వరకు పెరిగాయి. అంతర్జాతీయ నిపుణుల లెక్కల ప్రకారం.. బారెల్ ముడి చమురు ధర $1 పెరిగితే, దేశీయంగా లీటర్ ఇంధనంపై 50-60 పైసల భారం పడుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు $80 దిగువకు పడిపోవడంతో, చమురు కంపెనీల ఉత్పత్తి మరియు రవాణా వ్యయం గణనీయంగా తగ్గనుంది. దీనివల్ల త్వరలోనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

2. ద్రవ్యోల్బణానికి (ధరల పెరుగుదలకు) బ్రేక్

దేశంలో రవాణా రంగానికి డీజిల్ ధరలే కీలకం. ఇంధన ధరలు తగ్గినప్పుడు రవాణా ఖర్చులు (Freight Costs) అదుపులోకి వస్తాయి. దీనివల్ల నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ముడి చమురు ధరల పతనం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా స్పష్టం చేసింది.

3. తగ్గుముఖం పట్టనున్న దిగుమతి బిల్లు
భారత్ ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 50 లక్షల బారెళ్ల (5 Million Barrels) చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర ప్రతి $10 తగ్గితే.. భారత్ వార్షిక చమురు దిగుమతి బిల్లుపై సుమారు $13-15 బిలియన్ల (దాదాపు రూ. 1.1 – 1.3 లక్షల కోట్లు) భారం తగ్గుతుంది. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలు సురక్షితంగా ఉంటాయి.

4. రూపాయి బలోపేతం & కరెంట్ అకౌంట్ లోటుకు కట్టడి
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ, డాలర్‌తో పోలిస్తే రూ. 95 మార్కును దాటిన భారత కరెన్సీ (రూపాయి)కి ఈ చమురు ధరల తగ్గుదల పెద్ద ఊరటనిచ్చింది. చమురు కొనుగోళ్లకు తక్కువ డాలర్లు ఖర్చు అవ్వడం వల్ల రూపాయి తిరిగి బంప్ అవుతుంది. మరోవైపు, క్రూడ్ ధరలో ప్రతి $10 తగ్గుదలకు, దేశ జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు (CAD) దాదాపు 0.3% నుంచి 0.4% వరకు తగ్గుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

5. స్టాక్ మార్కెట్లకు ఊపు
ముడి చమురు ధరలు తగ్గడం వల్ల చమురును ముడిసరుకుగా ఉపయోగించే పెయింట్స్, టైర్లు, ఏవియేషన్ (విమానయానం), సిమెంట్, లాజిస్టిక్స్, కెమికల్ కంపెనీల ఇన్‌పుట్ ఖర్చులు తగ్గుతాయి. వ్యయాలు తగ్గి లాభాలు పెరగడంతో ఈ రంగానికి చెందిన కంపెనీల షేర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా భారతీయ స్టాక్ మార్కెట్లు (సెన్సెక్స్, నిఫ్టీ) భారీ లాభాల బాట పట్టేందుకు ఇది దోహదం చేస్తుంది.