Reading Time: < 1 minute
Pm Modi Vivatech 2026 India Eu Fta France Innovation Partnership

ఫ్రాన్స్‌లో నిర్వహించిన వివాటెక్ (VivaTech) 10వ ఎడిషన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. యూరప్‌లోనే అతిపెద్ద సాంకేతిక సదస్సుగా పేరుగాంచిన వివాటెక్ విజయవంతంగా నిర్వహించడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు పాటు నిర్వాహకులకు మోడీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. “వివాటెక్ 10వ ఎడిషన్‌లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది యూరప్‌లోనే అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో అధ్యక్షుడు మాక్రాన్, నిర్వాహకుల కృషి అభినందనీయం” అని అన్నారు.

అలాగే 2026 సంవత్సరం భారత్-యూరప్ సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ఏడాదిగా నిలిచిందని పేర్కొన్నారు. “ఈ ఏడాది ప్రారంభంలో భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఈ ఒప్పందం వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించడమే కాకుండా ప్రతిభ, సాంకేతికత, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారానికి కొత్త అవకాశాలను తెరుస్తుంది” అని మోడీ వెల్లడించారు.

అదేవిధంగా, ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ ప్రారంభంతో భారత్, యూరప్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని చెప్పారు. “ఈ ఏడాది ఫ్రాన్స్ ఒక కీలక వారధిగా మారి, భారత్ మరియు యూరప్ టెక్ ఎకోసిస్టమ్‌లను మరింత దగ్గర చేస్తోంది” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, డిజిటల్ సహకారం వంటి రంగాల్లో భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.