Reading Time: 2 minutes
Hormuz Strait Reopens Oil Tankers Resume Smooth Passage After Us Iran Peace Deal

హమ్మయ్య.. 3 నెలల తర్వాత హార్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య నౌకలు సాఫీగా ప్రయాణం చేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా యథావిధిగా పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా హార్ము్జ్ గుండా ఓడలు ప్రయాణాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అయితే లెబనాన్‌కు సంబంధించిన సంక్షోభం మాత్రం ఇంకా వీడలేదు.

ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం తర్వాత గల్ఫ్ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురువారం సుమారు 6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకువెళ్తున్న సౌదీ జెండా గల మూడు పెద్ద చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందం తర్వాత హార్ముజ్ జలసంధిలో ఉపశమనం కలిగించే చిత్రాలు వెలువడ్డాయి. అక్కడ ఇప్పుడు చమురు ట్యాంకర్లు, ఓడల రాకపోకలు సజావుగా సాగుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం-ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిర్ణీత గడువు కంటే రెండు రోజుల ముందుగానే ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం జరిగింది.

అయితే లెబనాన్ నుంచి మాత్రం తమ సైన్యాన్ని ఉపసంహరించుకునే ఉద్దేశం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. గురువారం ఇజ్రాయెల్.. దక్షిణ లెబనాన్‌లోని మరిన్ని ప్రాంతాలను తన నియంత్రణలో ఉన్న బఫర్ జోన్‌గా చూపిస్తూ ఒక కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉంచేందుకు అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని ఇద్దరు ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. నెతన్యాహుకు సన్నిహితంగా ఉండే ఒక సీనియర్ అధికారి ఈ చర్చలను ‘కష్టమైనవి, మొండివి’గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని అన్నారు.

గురువారం దక్షిణ లెబనాన్ పట్టణాలైన కఫ్రాత్‌బానిట్, జెబ్దీన్‌లపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు మరణించారని.. అలాగే రాజధాని బీరుట్, దాని దక్షిణ శివారు ప్రాంతాలలో కూడా ఇజ్రాయెల్ డ్రోన్ కార్యకలాపాలు కనిపించాయని లెబనాన్ ప్రభుత్వ వార్తా సంస్థ నివేదించింది.