
హ్యాకింగ్ చేయడానికి కూడా మనుషుల్ని హైరింగ్ చేసుకోవడం ఏంట్రా బాబు.. ఇదేం దందా. ఒకప్పుడు బిజినెస్ డేటా సేఫ్టీ, కంపెనీలు నడపడానికో ఐటీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకునేవారు. రోజులు మారాయి.. ఇప్పుడు ఆన్‌లైన్ పోకర్ సైట్లను హ్యాక్ చేసి, కోట్లు దోచుకోవడానికి ఏకంగా ఒక ఇంటర్నేషనల్ హ్యాకర్‌నే జీతానికి పెట్టుకున్నాడు ఒక బిజినెస్‌మెన్. వినడానికి సినిమా కథలా ఉన్నా.. బెంగళూరులో వెలుగుచూసిన ఈ రియల్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ గ్యాంబ్లింగ్ వ్యాపారి సునీష్ హెగ్డే బెయిల్ పిటిషన్‌ను ఈడీ కోర్టులో తీవ్రంగా వ్యతిరేకించిన వేళ ఈ ఘరానా మోసాల చిట్టా మొత్తం బయటకు వచ్చింది.
కర్ణాటకలో పలు గేమింగ్, పోకర్ క్లబ్‌లు నడిపే సునీష్ హెగ్డే.. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ హ్యాకర్ అయిన శ్రీకృష్ణ అలియాస్ శ్రీకిని తన అక్రమ సంపాదన కోసం వాడుకున్నాడు. ప్రముఖ ఆన్‌లైన్ పోకర్ ప్లాట్‌ఫారమ్‌లైన ‘పోకర్‌సెయింట్’, ‘పోకర్‌బాజీ’ వంటి సైట్లను హ్యాక్ చేయాల్సిందిగా శ్రీకిని హెగ్డే బెదిరించి మరీ ఒప్పించాడు. ప్లాన్ ప్రకారం శ్రీకి ఆ సైట్లను హ్యాక్ చేసి సర్వర్లను స్తంభింపజేశాడు. ఆ తర్వాత సునీష్ హెగ్డే ఒక మధ్యవర్తిలా ఆయా సంస్థల నిర్వాహకులను కలిసి.. మీ సైట్లలో లోపాలున్నాయి, వాటిని సరిచేయాలంటే రూ.2 కోట్లు ఇచ్చుకోవాలి అంటూ బ్లాక్‌మెయిల్ చేసి ‘ఎక్స్‌టార్షన్ గేమ్’ ఆడాడు. ఈ విధంగా వసూలు చేసిన రూ.2 కోట్లలో కొంత భాగాన్ని డెల్టా కార్ప్ క్యాసినో చిప్స్ రూపంలో.. మరికొంత భాగాన్ని క్యాష్, క్రిప్టోకరెన్సీ రూపంలో తన అకౌంటెంట్ రాబిన్ ఖండేల్వాల్ ద్వారా హెగ్డే రీరూట్ చేశాడు.
ఈ కేసు కేవలం ఒక హ్యాకింగ్ స్కామ్ మాత్రమే కాదు.. దీని వెనుక పెద్ద రాజకీయ, పోలీస్ నెట్‌వర్క్ కూడా ఉందని ఈడీ దర్యాప్తులో తేలింది. 2017 నుంచి 2020 మధ్య కాలంలో హ్యాకర్ శ్రీకి చుట్టూ బెంగళూరుకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.ఎ. హారిస్ కుమారుడు మహ్మద్ నలపాడ్ వంటి రాజకీయ నేతలు తిరిగేవారు. 2017లో యునోకాయిన్ అనే క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ నుంచి శ్రీకి కొట్టేసిన రూ.కోటి 14లక్షలు విలువైన బిట్‌కాయిన్ల ద్వారా మహ్మద్ నలపాడ్ లబ్ధి పొందాడని కర్ణాటక పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ALSO READ : ఏటీఎం పిన్ వెనుక ఇంత కథ ఉందా..!
ఈ స్టోరీలో ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. నాడు దర్యాప్తు చేసిన పోలీసులే లంచాలకు కక్కుర్తి పడి కేసును పక్కదారి పట్టించటం. నవంబర్ 2020లో శ్రీకి మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు.. అతని వద్ద రూ.850 కోట్ల విలువైన దాదాపు 4వేల బిట్‌కాయిన్లు ఉండేవని సాక్షులు చెప్తున్నారు. ఆ సమయంలో దర్యాప్తు చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి చెందిన నలుగురు పోలీస్ అధికారులు, ఒక సైబర్ నిపుణుడు ఈ హ్యాకర్ నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్లు ఎస్ఐటీ గుర్తించింది. ప్రస్తుతం సునీష్ హెగ్డే, హ్యాకర్ శ్రీకి, అకౌంటెంట్ రాబిన్ ఖండేల్వాల్ జైల్లో ఊచలు లెక్కపెడుతుండగా.. వీరి మనీ లాండరింగ్ దందా ఇటు పోలీస్ శాఖను, అటు రాజకీయ వర్గాలను వణికిస్తోంది.